రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం పై ఇంకా ఉత్కంట కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు సంబందిచి ఐదు అంశాలపై గవర్నర్ తమిలిసై లేవనెత్తిన అంశాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం రాజ్ భవన్ కి పంపింది. అయితే, ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అంతే కాకా, ఈ బిల్లు పై ఉన్నతాధికారుల నుంచి గవర్నర్ మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఆదివారం శాసన సభ, శాసన మండలి సమావేశాల ఎజెండాలో లేని ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లు లేకపోవడం గమనర్హం. అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు ప్రవేశ పెట్టాలంటే గవర్నర్ ఆమోదం అవసరం. ఆదివారం మధ్యాహ్నం 12.30కి గవర్నర్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టిసి ఉన్నతాధికారులను గవర్నర్ రాజ్ భవన్ కు పిలిపించారు. మరో వైపు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ స్పీకర్ ని కలిశారు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదించిన వెంటనే బిల్లును స్పీకర్ అనుమతి తో టేబుల్ పై ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటేకాక, బిల్లు కు గవర్నర్ ఆమోదం అందని పక్షంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.