జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి పై ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఆ స్థలంపై ఉన్న న్యాయపరమైన చిక్కులపై చర్చించడానికి సొసైటీ నేతలతో రాష్ట్ర రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ న్యాయవాది (రెవిన్యూ)లతో సోమవారం సమావేశం ఉన్నట్టు సొసైటీ కార్యదర్శి వంశీ తెలిపారు. ఇదిలా ఉంటే, సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం సొసైటీకి అప్పజెప్పక పోవడతో ఈ నెల 10వ తేదిన నగరంలోని హెచ్ఎండిఎ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటన చేసిన సొసై టీ నేతలు ఆ రోజు ఎలాంటి కార్యక్రమం నిర్వహించక పోవడం, కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళిన సభ్యుల బృందం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెల ౩౦వ తేదిన పేట్ బషీరాబాద్ స్థలంలో జరిగిన సొసైటీ సర్వ సభ్య సమావేశంలో నేతలు మాట్లాడుతూ ఈ నెల మొదటి వారంలోపు సమస్యని పరిష్కరించాకపోతే హెచ్ఎండిఎ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. కానీ, ఆ రోజు ఎక్కడా కార్యక్రమాలు నిర్వహించిన జాడ లేదు. అంతేకాక, అసలు దీనిపై సొసైటీ తరఫున సభ్యులకు ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ అధికారులతో చర్చలు ఉన్నందున ఈ కార్యక్రమం చేపట్టలేదని వంశీ సమాచారంతో సభ్యులకు అర్ధమైంది.

ఇదిలా ఉంటే స్థలాన్ని దక్కించుకోవడానికి సొసైటీ సభ్యుల్లో కొందరు కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. కానీ, సభ్యులు అక్కడికి వెళ్లి నలుగు రోజులైనా ఎలాంటి పిటిషన్ కి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం కూడా సభ్యులను అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ బృందం హైదరాబాద్ లో ఉన్నప్పుడు ప్రతీ అంశంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేదని, డిల్లీ వెళ్ళిన తర్వాత ఎలాంటి సమాచారం లేదని సభ్యులు చెబుతున్నారు. డిల్లీ జరిగే తాజా పరిస్థితులపై సమాచారం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, పేట్ బషీరాబాద్ స్థలం విషయంలో సంబంధిత అధికారులు, సొసైటీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ సమయంలో నిరసనలు చేపడితే భావ్యం కాదనే ఉద్దేశ్యంతో ఆ కార్యక్రమం నిర్వహించలేదని తెలుస్తోంది. కమిటీతో ప్రభుత్వ అధికారుల చర్చలు సానుకూలంగా జరిగితే వచ్చే వారంలో పేట్ బషీరాబాద్ స్థలంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.