“బిచ్చగాళ్లను” నమ్మకండి…

IMG 20230821 WA0002

మొన్నటి వరకూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు.

IMG 20230821 WA0000

రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మించుకున్నామని, ఇంత అద్భుతమైన కలెక్టరేట్లు, పోలీసు భవనాలు ఎక్కడా లేవని, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీలు కూడా మన కలెక్టరేట్ల మాదిరిగా లేవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆకలి లేని రోజులు వచ్చాయని, జట్టు కట్టి, పట్టుపట్టి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ జీరో ఫ్లోరైడ్‌ రాష్ట్రమని కేంద్రమే ప్రకటించిందిని సీఎం కేసీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో త్వరలోనే పింఛన్ల పెంపుపై ప్రకటన చేస్తామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో జిల్లాకు చెందిన చాలా మంది మంత్రులుగా పనిచేశారని, సూర్యాపేటను ఎలా అభివృద్ధి చేశారో తెలియని విషయం కాదన్నారు. సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్‌ కాలేజీలు పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నారా? సూర్యాపేట, నల్గొండ గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి. ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారు. ప్రజలు ఆగం కావొద్దని,రూ.4వేలు వృద్ధాప్య పింఛను ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4వేలు పింఛను ఇస్తున్నారా, కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్రానికో విధానం ఉంటుందా, మేం కూడా పింఛన్లు తప్పకుండా పెంచుతామని తెలిపారు. పింఛన్ ఎందుకు పెంచుతామనేది వివరిస్తామని సీఎం చెప్పారు. కాంగ్రెస్‌ గెలిచిన కర్ణాటకలో అప్పుడే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. ఇవాళ తెలంగాణలో పండే వడ్లను తరలించేందుకు లారీలు సరిపోవట్లేదు.

కాంగ్రెస్‌ ఆపద్బంధు పథకం, భారాస రైతు బీమాను పోల్చి చూడాలి. ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రైతు బంధు, రైతు బీమా డబ్బు ఖాతాలో పడుతోంది. ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. ధరణి పోర్టల్‌ తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుంది. ఒక్కసారి ధరణిలో భూమి నమోదైతే మార్చే మొనగాడు ఉందరన్నారు. మండల కేంద్రంలోనే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ అయ్యేలా ధరణి పని చేస్తుందని తెలిపారు. ఓటు అనే ఆయుధాన్ని బాగా ఆలోచించి వాడుకోవాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు భారాస గెలవాలని ఆకాంక్షించారు. సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు, జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. రూ.25 కోట్లతో సూర్యాపేటలో కళాభవన్‌ , ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నిర్మించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *