చంద్రయాన్-3ని నింగిలోకి తీసుకెళ్లిన లాంచ్ వెహికల్ మార్క్-3 రూపకల్పనలో ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ భారతి కీలకంగా వ్యవహరించారు. 2022 జనవరిలో ఆయన ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకముందు వరకు ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. చంద్రయాన్-3 తోపాటు త్వరలో ఇస్రో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్, సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పూర్వ విద్యార్థి. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ల నిర్మాణం, ప్రొపల్షన్ సిస్టమ్ డిజైన్, డైనమిక్స్ డిజైన్, సెపరెషన్ సిస్టమ్ వంటి విభాగాల్లో ఈయనకు అపార అనుభవం ఉంది.
2019లో చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వీర ముత్తువేల్ బాధ్యతలు చేపట్టారు. కొత్త రోవర్, ల్యాండర్ నిర్మాణం ఈయన పర్యవేక్షణలోనే జరిగింది. ఐఐటీ మద్రాసు నుంచి సాంకేతిక విభాగంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. చంద్రయాన్-2 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వనితా ఆధ్వర్యంలో ఈయన పనిచేశారు.చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ఉన్న స్పేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, మంగళయాన్ మిషన్‌లో కూడా భాగస్వామ్యం అయ్యారు.
చంద్రయాన్-3కి కల్పన డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కల్పన చెన్నైలో బీటెక్ పూర్తయిన వెంటనే ఇస్రోలో శాస్త్రవేత్తగా విధుల్లో చేరారు. తొలుత శ్రీహరికోటలో ఐదేళ్లపాటు విధులు నిర్వహించారు. 2005లో బదిలీపై బెంగళూరులోని ఉపగ్రహ కేంద్రానికెళ్లి అక్కడ విధులు నిర్వహించారు. ఐదు ఉపగ్రహాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. చంద్రయాన్-2 ప్రాజెక్టులో ఈమె భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం చంద్రయాన్-3 ప్రాజెక్టు అసోసియేటెడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ కేరళలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చంద్రయాన్-3ని నింగిలోకి తీసుకెళ్లిన ఎల్‌ఎమ్‌వీ-3ని (గతంలో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3గా పిలిచేవారు) వీఎస్‌ఎస్‌సీలో నిర్మించారు. చంద్రయాన్-2 మిషన్‌లో కూడా ఉన్నికృష్ణన్ వీఎస్‌ఎస్‌సీలోని తన బృందంతో కలిసి కీలక పాత్ర పోషించారు.
2021లో యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ డైరెక్టర్‌గా ఎమ్ శంకరన్ బాధ్యతలు చేపట్టారు. ఈయనను ఇస్రో పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. ఉపగ్రహాలకు అవసరమైన పవర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో ఈయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. భారత దేశ అవసరాలకు తగినట్లుగా (కమ్యూనికేషన్, నావిగేషన్, రిమోట్ సెన్సింగ్, వాతావరణ పరిస్థితుల అంచనా, గ్రహాల అన్వేషణ) ఉపగ్రహాలను తయారు చేయడం యూఆర్‌ఎస్‌సీ బాధ్యత. భౌతికశాస్త్ర పట్టభద్రుడైన శంకరన్ చంద్రయాన్-3 మిషన్‌లో కీలకమైన ల్యాండర్ శక్తిని పరీక్షించేందుకు అసవరమైన చంద్రుడి ఉపరితలాన్ని పోలిన నిర్మాణాన్ని భూమిపై రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయన చంద్రయాన్-1, చంద్రయాన్-2 మిషన్‌లో కూడా పనిచేశారు.
నారాయణన్ తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు అవసరమైన థ్రస్టర్లను ఈయన నాయకత్వంలోనే అభివృద్ధి చేశారు. ఐఐటీ ఖరగ్ పూర్ పూర్వ విద్యార్థి. క్రయోజెనిక్ ఇంజిన్స్ నిర్మాణంలో ఈయన నిపుణుడు.
బీఎన్ రామకృష్ణ బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియలో ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్న ప్రక్రియను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. భారతదేశంలోని 32-మీటర్ల అతిపెద్ద డిష్ యాంటెనా ఈ కేంద్రంలోనే ఉంది. దీని సాయంతోనే శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్‌కు కమాండ్‌లు పంపుతారు.