చంద్రగ్రహం దక్షిణ దిక్కున చంద్రయాన్ -3 పరిశోధనలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రోవర్ లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్(ఎల్.ఐ.బి.ఎస్.) చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్ ఉనికిని తొలిసారి గుర్తించినట్లు తెలిపింది. ప్రజ్ఞాన్ రోవర్ పలు రకాల మూలక మిశ్రమాలను గుర్తించింది. జాబిల్లి పై ప్రాణ వాయువు ఆక్సిజన్ తోపాటు సల్పర్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించిందని ఇస్రో ప్రకటించింది. అంతేకాక అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ కూడా ఉన్నట్లు తెలిపింది. రోవర్ సహాయంతో చంద్రుని మీద హైడ్రోజన్ కోసం అన్వేషిస్తున్నట్లు ఇస్రో వివరించింది.
దక్షిణ ధ్రువంపై అధ్యయనానికి సైంటిస్టులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో తయారు చేసిన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఉపరితలంపై శక్తివంతమైన లేజర్ ను ప్రసరింపజేయడం వల్ల వెలువడే కాంతి కిరణాల ఆధారంగా మూలకాలను గుర్తించి డేటాను సైంటిస్టులకు పంపుతుంది. ఈ డేటాను సైంటిస్టులు విశ్లేషిస్తారు. ఈ పరికరాన్ని బెంగళూరులోని ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ ఎల్.ఐ.బి.ఎస్. అభివృద్ధి చేసింది.