అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేపట్టే పనులు, ప్రవేశ పెట్టే పథకాలు అన్నీ ప్రజల ఆమోదం పొందాలనే నిబంధన ఏమీ లేదు. ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే వ్యతిరేకించ వచ్చు. అప్పటికీ ప్రభుత్వం తీరు మారకపోతే రోడ్డు ఎక్కి నిరసనలు చేయవచ్చు, ధర్నాలు చేపట్టవచ్చు. ప్రశ్నించడం అనేది పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అంతేగానీ, ప్రభుత్వం పై గళం విప్పే ప్రతీ వ్యక్తి తీవ్రవాది కాదు. తీవ్రవాదుల ఆశయాలు, వాళ్ళ లక్ష్యం వేరుగా ఉంటుంది. కానీ, తమ బతుకులకు, మనుగడకు ప్రమాదంగా మారే ప్రభుత్వ విధానాలను మార్చడానికి మాత్రమే సామాన్య ప్రజలు రోడ్ల పైకి వస్తారనేది చరిత్ర. దీనికి మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక, కర్షక మేధావి వర్గాలు సహకరించ వచ్చు. అంతేకానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతీ ఒక్కరూ తీవ్రవాదులు, ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు కాదు. అక్షరాస్యత అంతగా లేని గ్రామీణ భారత అమాయక ప్రజలకు మేధావి వర్గం బాసట ఎప్పటికీ అవసరమే. వాళ్లను చైతన్య పరచడానికి ఈ వర్గం ఎప్పటికప్పుడు కృషి చేస్తోంది. అలాంటి మేధావి వర్గాన్ని బాధ్యత గల ప్రధాన మంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ “మేధో నక్సల్స్” గా అభివర్ణించడం పెద్ద తప్పిదంగా రాజకీయ వర్గాలు భగ్గుమంటున్నాయి. మొన్నటి వరకు “అర్బన్ నక్సల్స్” అంటూ వచ్చిన మోడీ ఇప్పుడు మేధావుల పై సైతం నక్సలైట్లుగా ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట సాక్షిగా విద్యావంతులైన మేధావి వర్గాన్ని మోడీ అవమానపరిచారని ప్రజా సంఘాలు దుయ్యబడుతున్నాయి.
మొన్న ఢిల్లీలో జరిగిన దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోడీ దేశ ప్రజల సంక్షేమ పథకాల పనితీరు, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలను అతి తక్కువగా ప్రస్తావించారు. ఇదే సందర్భంలో మేధావి వర్గం పై విరుసుకు పడ్డారు. మోడీ ప్రసంగంలో మేధావులను నక్సలైట్లుగా చూపడాన్నే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నట్టు కనిపించింది. దేశంలో సాయుధ నక్సలైట్లను ఏరివేశామని, ఇప్పుడు జనం మధ్య ఉన్న “మేధో నక్సల్స్” ప్రమాదకరంగా మారారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో గంటల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా నిరసనలు, విమర్శలు గుప్పుమన్నాయి. మోడీ దేశంలో మేధావులను తీవ్రవాదుల కింద జాతకట్టే కుట్ర చేస్తున్నారని ఒక్కసాటిగా విరుసుకుపడ్డాయి. “నీట్ “ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై మేధావీ వర్గం నిరసన తెలిపినందుకే ప్రధాన మంత్రి వారిని సంఘ విద్రోహ శక్తులుగా అభివర్ణిస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ప్రభుత్వ బెదిరింపు చర్యగా పౌరహక్కు సంఘ నేతలు అంటున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే నక్సలైట్లనే ముద్ర వేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంటున్నారు.
ఇదిలా ఉంటే, మోడీ ఎర్రకోట నుంచి ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. గతంలో “బొద్దింక” పార్టీ మాదిరిగానే ఇప్పుడు మోడీ ప్రసంగానికి వ్యంగ్యంగా “దిమాగీ నక్సల్ జనతా పార్టీ” (డి.ఎన్. జె. పి.)) అనే హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్‌తో సరికొత్త డిజిటల్ ట్రెండ్‌ను సృష్టించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే లేదా ప్రశ్నించే ప్రతి ఒక్కరికీ ఈ ముద్ర వేస్తున్నారంటూ వారు వ్యంగ్య అస్త్రాలు సంధించారు.
