ప్రజాస్వామ్య దేశంలో ఒకరు చెప్పినట్టు అందరూ వినాలంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఒక్కొక్కరి ఆలోచనలు, అభిప్రాయాలు, వ్యక్తిగత పోకడలు వేరుగా ఉంటాయి. భారత రాజ్యాంగంలోని అనేక నిబంధనలను ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మార్చివేస్తూ పార్లమెంట్ ద్వారాలు సైతం ముసివేసి మరీ బలవంతపు చట్ట సవరణలు చేసుకుంటున్న ఈ రోజుల్లో, పౌరులు సైతం తమ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు వెతుక్కోవడం తప్పు కాదు. ఈ మార్గాలు రాజ్యాంగ నిబంధనలకు అనుకూలంగా ఉండవచ్చు లేదా కొంత భిన్నంగా ఉండవచ్చు. ప్రత్యేకించి ఈ ఆధునిక కాలంలో యువత నిర్ణయాలు పుస్తకాల్లోని నిబంధనలకు సైతం అంతుచిక్కకుండా ఉన్నాయి.
బహుశా చరిత్ర పాఠాలు తొలగించిన ఫలితమో, లేక మారుతున్న పరిస్థితుల ప్రభావమో కానీ యువత పాత పద్ధతులను లెక్క చేయడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. కోడింగ్ చేసిన ఎ.ఐ. కంటే చురుకుగా భవిష్యత్తుకి సంబంధించిన విషయాల్లో యువత తమ ఆలోచనలను వెంటనే ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. నెల రోజులుగా దేశంలో వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా చూపవచ్చు.”నీట్” పరీక్షలో చోటుచేసుకున్న భారీ అవకతవకలు లక్షలాది మంది విద్యార్ధుల ఆశలపై నిరుజల్లాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉవ్వెత్తున ఎగిసిన నిరసన సెగలు కేంద్ర మంత్రి వర్గాన్ని తాకాయి. చివరకు విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య కొంత మేరకు కుదుటపడింది. కానీ, నిరసన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. 19 రోజుల పాటు సమావేశాలు జరిగినా ప్రధాన మంత్రి మోడీ గానీ, హోం మంత్రి అమిత్ షా గానీ సభకు రాలేదు. గతంలో ఎన్నడూ జరగని విధంగా చివరి రోజు వచ్చి వందేమాతర గీతం పాడి వెళ్ళారు. కానీ, నీట్, రామమందిర విరాళాల దారి మళ్లింపు అంశాల వేడి ఇంకా తగ్గ లేదు.
ఇక హైదరాబాద్ కేంద్రంగా మరో వివాదం తెరపైకి వచ్చింది. నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ ని అతిథిగా ఆహ్వానించడాన్ని అక్కడి విద్యార్థులు వ్యతిరేకించారు. యువతను బొద్దింకలతో పోల్చిన సూర్య కాంత్ ని అతిథిగా అంగీకరించే ప్రసక్తే లేదని నల్సార్ న్యాయ శాస్త్ర విద్యార్ధులు ప్రకటించారు. విద్యార్థుల వ్యతిరేకతను పరిశీలించి నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత యూనివర్సిటీ పాలక మండలి పై ఉంటుంది. కానీ, డిల్లీ లోని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అత్యుత్సాహంతో తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. “విశ్వవిద్యాలయంలోని 2026 సంవత్సరం బ్యాచ్ విద్యార్ధులను న్యాయవాదులుగా నమోదు చేసుకోవద్దు” అంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ పవన్ కుమార్ మిశ్రా దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్ లకు లేఖ రాశారు. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన మొదలైంది. అయితే, తర్వాత జరగబోయే పరిణామాలను అంచనా వేసిన బార్ కౌన్సిల్, మళ్ళీ “కాక్రోచ్” లు బయటకు వస్తాయని భావించినట్టు గంటల వ్యవధిలోనే తన తొందర పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అసలు, విశ్వవిద్యాలయం వ్యవహారంలో కౌన్సిల్ తల దూర్చడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ప్రధాన న్యాయమూర్తి దృష్టిని ఆకర్షించడానికే కౌన్సిల్ అతిగా స్పందించిందనే వాదనలు మొదలయ్యాయి. అయితే, సూర్య కాంత్ మాత్రం హుందాగా వ్యవహరించడం విశేషం. నల్సార్ కి తనకి మధ్య జరుగుతున్న వ్యవహారంలో తల దూర్చాల్సిన అవసరం ఏమొచ్చిందని బార్ కౌన్సిల్ పై ఆయన మండిపడ్డారు.
