రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ నియోజక వర్గంలో పరిస్థితులు మారబోతున్నాయా? అధికార పార్టీ నేత ఆశిస్తున్న హ్యాట్రిక్ విజయం ఆయన్ని వరిస్తుందా? ఎన్నికలు సమిస్తున్నందున డోన్ లో ఇలాంటి సవ్వా లక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకొవలని తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది. వైసిపి నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. ఈ సీటును వరుసగా రెండుసార్లు కైవసం చేసుకున్న అయన ఇప్పుడు హ్యాట్రిక్ సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే, డోన్ లో ప్రజలకు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉండడంలేదని బుగ్గనపై కొంత అసంతృప్తి ఉంది. ఆర్థిక మంత్రిగా ఆయన పాత్ర ఉన్నప్పటికీ, బుగ్గన తరచుగా అమరావతి లేదా న్యూఢిల్లీలో ఉంటారానే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి భిన్నంగా టీడీపీ ఇన్‌చార్జి ధర్మారం సుబ్బారెడ్డి అధికార పార్టీ అక్రమాలను చురుగ్గా బయటపెడుతూ ప్రజల్లోకి చొచ్చుకు పోతున్నారు. ఈ నియోజకవర్గంలో యువగళం పాదయాత్రను విజయవంతంగా నిర్వహించి, లోకేష్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన బుగ్గన కనీసం 10 రోజుల సమయం కేటాయించి ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.