ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మహిళల సాధికారతకు పెద్ద పీట వేయడం జరిగిందని, 90 శాతం పైగా పథకాలను మహిళల పేరుతోనే అందించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మహిళలు సంక్షేమం పథకాలను తెలుసుకొని సామాజికంగా, ఆర్థికంగా లబ్ది పొందాలని ఆకాంక్షించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్తోన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమాన్ని లెక్కలతో సహా కుటుంబ సభ్యులకు వివరించారు. ఇంటింటికి హారతులు పడుతూ హోం మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల,మత, పార్టీలకతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆమె తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అంతా మీ కోసమే…
