రాజకీయ, సామజిక ఉద్యమాలకు పురుటి గడ్డగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు మళ్లీ జడలు విప్పుతున్నాయా? కమ్మ, కాపు, రెడ్డి అంటూ ఆధిపత్య పోరుకు ఆయా వర్గాలు కోరలు చాస్తున్నాయా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రలో సర్దుమణిగాయనుకున్న కులాల కక్షలు తిరిగి పెట్రేగుతున్నాయా? మూడు, నలుగు దశాబ్దాల నాటి మాదిరిగా పగలు, ప్రతీకారాలు కారాలు, మిర్యాలు దంచుతున్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ సామాన్యుని మదిని తొలుస్తున్నాయి. గత పక్షం రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలే ఇందుకు కారణం. సామజిక, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని స్థాయిలో శరవేగంగా సాగుతున్న ప్రతీకార, అణచివేత ధోరణులు ఆందోళనకు గురి చేసేవిగా ఉన్నాయి. కులం, రాజకీయ ప్రాబల్యం కోసం అప్పట్లో బెజవాడలో రౌడీఇజం, రాయలసీమలో ఫ్యాక్షనిజం వేళ్ళునుకుంటే, ఇప్పుడు అందుకు భిన్నంగా “అవినీతి” ముసుగులో చిచ్చు రాజుకోవడం పరిశీలకులకు అంతుపట్టకుండా ఉంది. ఉమ్మడి రాష్త్రంలో 2014 వరకు ఉన్న రాజకీయ పదవుల కోసం ఆధిపత్య పోరాటాలను ఒక్కసారి పరిశీలిస్తే ఇలా ఉంది.
ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాల రెడ్డిల మధ్య జరిగిన వర్గ పోరు చరిత్ర కారులు ఇప్పటికీ మరచిపోరు. అదే తరహాలో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణా రావు, నీలం సంజీవ రెడ్డిల మధ్య తలెత్తిన వివాదాలు కుల పోరుకు చెందినవే అని రాజకీయ పరిశీలకులు చెప్పడం బహిరంగ రహస్యమే. దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డిల మధ్య పొడపోచ్చలు, పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయన ప్రవేశపెట్టిన భూసంస్కరణలకు వ్యతిరేకంగా గళం విప్పిన కాసు బ్రహ్మానంద రెడ్డి, జలగం వెంగళరావు హయంలో మర్రి చెన్నారెడ్డి వర్గం చేసిన హడావిడి అధిష్టానన్నే గుక్కతిప్పుకోకుండా చేసిన సంగతి అప్పటి నేతలకు ఇంకా గుర్తుండడం విశేషం. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోశయ్య ఎలాంటి పరిస్థితుల్లో పదవి నుంచి తొలగిపోయారనేది రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన సంగతే. అయితే,గతంలో వర్గ పోరాటాలు, ఎత్తులు పై ఎత్తులకు పదవీ కాంక్ష ఒక్కటే కేంద్ర బిందువుగా కనిపించేది. కానీ, మారుతున్న రోజులతో పాటు కక్షలలోని పౌరుషంలో కూడా మార్పులు వచ్చినట్టు కనిపిస్తోంది. వ్యక్తిగత కక్ష సాధిపులు గతంలో తమిళ రాజకీయాల్లో కళ్ళకు కట్టినట్టు కనిపించేవి. అధికార, ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు జయలలిత, కరుణానిధిల మధ్య వైరాలు ఉహించని విధంగా తారా స్థాయికి చేరేవి. దాదాపు అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తోందని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై అవినీతి ఆరోపణలు మోపి ఎలాంటి సాక్షాలు చూపకుండా అరెస్టు చేశారని వివిధ వర్గాలు నిరసించడం, నైపుణ్య శిక్షణ నిధులను మింగేశారని అందుకే అరెస్టు చేశామని జగన్ ప్రభుత్వం కుండ బద్దలు కొట్టడం అంతుపట్టని వ్యవహారం. ఇదే సందర్భంలో జనసేన జైలులోనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారు చేసుకోవడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో తిరిగి కుల వర్గ పోరు ఉపిరి పోసుకున్తుందా అనే సందేహాలు గుప్పుమంటున్నాయి. రాజకీయ ఆధిపత్యంలో భాగంగా పట్టు విడుపులు ఉంటే హర్షించదగ్గ విషయమే, కానీ అదే కుల, మత పెత్తనం కోసం పావులు కదిపితే మాత్రం సామాన్యులకు సంకటమే అని సామజిక, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇవ్వన్నీ చూస్తుంటే స్వర్గీయ కులదిప్ నయర్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల విభజనను సమర్ధించిన అయన విడిపోయిన తర్వాత ఆ రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సామజిక పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అందుకే, ఆంధ్ర-తెలంగాణా ఉద్యమ సమయంలో ఆయన తటస్థంగా ఉన్నారు. అదీ మేదవుల లక్షణం. విధానం.