వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి వస్తే తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు 35 స్థానాలకు పైగా మహిళల చేతుల్లోకి వెళ్ళాక తప్పదు. మహిళా జనాభా ఆధారంగా చేసుకొని నియోజక వర్గాల కేటాయింపులు జరిగే అవకశాలున్నాయనే సమచారం అందుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి (బి. అర్.ఎస్.) మళ్ళీ కొత్త జాబితాను తయారు చేయాలి, సరైన మహిళా అభ్యర్ధులను వెతుక్కోవాలి. కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం వంటి ప్రధాన పార్టీలు కూడా ఆయా జిల్లాల్లో అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది.



వచ్చే ఎన్నికల్లో కనుక ఈ రిజర్వేషన్ల విధానం పూర్తీ స్థాయిలో అమలులోకి వస్తే ఇప్పుడున్న కొంతమంది ప్రముఖ సిట్టింగులను ఆయా పార్టీలు తప్పించాల్సి ఉంటుంది.సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, రూరల్ స్థానాలు,జహీరాబాద్, కామారెడ్డి, పటాన్ చెరు, గజ్వేల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కార్వాన్, యాకత్ పురా, శేరిలింగంపల్లి, మునుగోడు, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్, ములుగు, పినపాక, ఇల్లందు, మహబూబాబాద్, సత్తుపల్లి, కొత్తగూడెం, నిర్మల్, ముథోల్, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, హుజురాబాద్, , చేవెళ్ల, మహబూబ్ నగర్, మక్తల్, వనపర్తి, గద్వాల్, హుజూర్ నగర్, దేవరకొండ, తుంగతుర్తి వంటి మహిళా జనాభా అధికంగా ఉన్న నియోజక వర్గాలు మహిళా అభ్యర్థులకు దక్కే అవకాశం ఉన్నట్టు వివిధ రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బి.అర్.ఎస్.కు మాత్రం కొంత తలనొప్పి ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని నియోజక వర్గాలలో ఇప్పటికే టికెట్ పొందిన వారు తమ భార్యలకు గానీ, సమీప బంధువులకు గానీ ఇప్పించుకునే ప్రయత్నాలను వెతుక్కుంటున్నారు. చట్టం అమలులోకి వస్తే దాదాపు అన్ని రాజకీయ పార్టీల అంచనాలు తారుమారు కావడం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావుస్తున్నారు. చట్ట సభల్లో మహిళలకు సమున్నత గౌరవం కల్పించడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నా కొందరు నాయకులకు మాత్రం గొంతులో వెలగ పండు చిక్కుకున్నట్టు ఉంది.