దసరా నుంచి అక్కడే…

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన వ్యవస్థ ను వచ్చే దసరా నుంచే విశాఖకు మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. విశాఖకు కార్యాలయాల తరలింపునకు కేబినేట్ ఆమోదం తెలిపిందని, కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు వివరించారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం నాడు కేబినేట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. కేబినేట్ నిర్ణయాలను సచివాలయ పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వెల్లడించారు. విశాఖలో ప్రభుత్వ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు పై నిర్ణయం తీసుకుంటారని వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు చేసే బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా ఇంటి స్థలం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలకు కూడా ఆరోగ్య శ్రీ వర్తించేలా చర్యలు తీసుకునేందుకు అంగీకరించిందన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పిల్లలకు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద ప్రయోజనాలు అందేలా చూసేలా నిర్ణయం తీసుకుందన్నారు.రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఐబీ విద్యావిధానాన్ని అమ‌లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐబీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని పిల్ల‌లు విదేశాల్లో చ‌దువుకునేందుకు క‌మ్యూనికేష‌న్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉండేందుకు ఐబీ సంస్థ‌తో ఎంవోయూ చేసుకున్నట్లు వివరించారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ చేసేందుకు నిర్ణయించింది. దీనివల్ల 10,115 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 11,630 మంది ఏపీవీపీలో పనిచేసే ఉద్యోగులకు మేలు చేకూరుతుంది. ఒంగోలు,ఏలూరు, విజయవాడ లోని నర్సింగ్‌ కాలేజీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *