ఆ జైలులో ఏం జరుగుతోంది…!

rjy jail c

గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి కేంద్ర కారాగారం కేవలం కొన్ని రోజులుగానే వార్తల్లోకి ఎక్కుతోంది? దోమల మూలంగా ఒక ఖైదీ చనిపోవడం, ఖైదీల మధ్య గొడవలు తలెత్తడం వంటి ఘటనలు ఈ మధ్యనే ఎందుకు జరుగుతున్నాయి. ఇలా గతంలో కూడా జరిగినా ఆ సమాచారం బయటకు పొక్కలేదా ? మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండడంతో ప్రతీ ఒక్కరిలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలులో జరుగుతున్న సంఘటనలపై అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులూ, వారిని పర్యవేక్షించే ఉన్నతాధికారుల మధ్య సఖ్యత కొరవడడం లేనిపోని అనుమానాలకు దారి తీస్తోంది. సుమారు పక్షం రోజుల కిందట జరిగిన వ్యవహారాన్ని కూడా దాచిపెట్టాల్సిన అవసరం ఏముందనే సందేహాలు కలుగుతున్నాయి. గత నెల 25న భోజనానికి వెళ్లే  క్రమంలో ఖైదీల మధ్య తోపులాట జరిగి ఓ రిమాండ్‌ ఖైదీ గాయపడిన విషయం బయటకు రావడానికి దాదాపు 15 రోజులు పట్టింది. అదీ ఆ ఖైదీని తప్పని పరిస్థితుల్లో చికిత్స కోసం కాకినాడకు తరలించే క్రమంలో అసలు విషయం గుప్పుమంది. విజయవాడ భవానీపురానికి చెందినా నవీన్ రెడ్డి  గంజాయి కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. గత నెల 25న భోజన సమయంలో సెల్‌ నుంచి బయటకు వస్తున్నప్పుడు తలెత్తిన గొడవలో నవీన్‌ అక్కడున్న సిమెంటు దిమ్మపై పడడంతో అతని ఎడమ దవడ ఎముకకు తీవ్ర గాయమైంది.  దీంతో శస్త్ర చికిత్స కోసం కాకినాడ జనరల్ ఆసుపత్రికి  తరలించి చికిత్స అందిస్తున్నారు.  అప్పటి నుంచి అధికారులు ఈ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త వహించారు. కానీ, మొన్న సోమవారం నాడు నవీన్‌రెడ్డిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ఘటనపై అధికారులు చెబుతున్న వివరణల్లో పొంతన కనిపించకపోవడం గమనార్హం. శస్త్రచికిత్స అవసరం ఉండనే అనే స్థాయిలో గాయమైనప్పుడు గత పదిహేను రోజులుగా జైలులో ఎలా చికిత్స చేశారనేది అంతుపట్టడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులను అడుగితే అసలు ఆ విషయమే తెలియదనే సమాధానం రావడం విమర్శలకు దారితీస్తోంది. గత నెల 25వ తేదీన భోజన సమయంలో బ్యారక్‌ నుంచి రిమాండ్‌ ఖైదీలు ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగి నవీన్‌ రెడ్డి కాలు జారి పక్కనే ఉన్న మెట్టుపై పడడంతో అతని ఎడమ దవడకు గాయమైందని మరో అధికారి వివరించారు. అయితే, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదంటే సరైన సమాధానం ఇవ్వలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో తలెత్తుతున్న ఇలాంటి సంఘటనల పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *