తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకే కాదు, సామాన్య ప్రజలకు సైతం అందరికి తెలిసిన నేత మల్లు భట్టి విక్రమార్క. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ప్రజలకు చేరువయ్యారు. కాంగ్రెస్ నేతలు, లోక్ సభ మాజీ సభ్యులు స్వర్గీయ మల్లు అనంత రాములు, మరో పార్లమెంటు సభ్యుడు మాజీ శాసన సభ మాజీ సభ్యులు మల్లు రవి సొంత తమ్ముడు విక్రమర్క. 1990వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో పిసిసి కార్యనిర్వాహక సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆది నుంచి అదే పార్టీ తరఫున ప్రజలతో మమేకమై రాష్ట్ర రాజకీయాల్లో తనదైన విక్ర “మార్కు” వేసుకున్నారు.
రాజకీయ విలువలు, అంకిత భావంతో ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా వ్యవహరించడం అయన నైజం. అదే విక్రమార్క ని పార్టీలో పట్టు వదలని “విక్రమార్కు”నిగా మలిచింది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయంలో 2007వ సంవత్సరం నుంచి 2009 వరకు శాసన మండలి సభ్యుడిగా పని చేశారు. ఆ తర్వాత మధిర శాసన సభ నియోజక వర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు. మధిర నియోజక వర్గంలో 2009, 2014, 2018 శాసన సభ సార్వత్రిక ఎన్నికలలో భట్టీదే పై “చేయి”. ఖమ్మం జిల్లాలో కమ్యునిస్టుల కంచుకోటగా ఉన్న మధిర నియోజక వర్గంలో పాగా వేసి కాంగ్రెస్ పార్టీ నుంచి హ్యాట్రిక్ సాధించిన నేతగా విక్రమార్క నిలవడం గమనార్హం. 2009 నుండి 2011 వరకు ఆయన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా వ్యవహరించారు. మూడేళ్ళ పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కార్యదర్శిగానూ పార్టీకి భట్టీ సేవలందించారు. 2011 నుండి 2014 వరకు శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అయన తెలంగాణా శాసన సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా వ్యవహరిస్తునారు.
భట్టి విక్రమార్క రాజకీయ జీవితంలో మరో మైలురాయి పాదయాత్ర. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అయన వైఎస్ ని దైవంగా పుజిస్తారు. అందుకే జననేత బాటలో తెలంగాణా జనం గోడు, గోస తెలుసుకోవాలనే తపనతో “పీపుల్స్ మార్చ్” ఆయన చేపట్టిన పాదయాత్ర సంచలనం రేపింది. ఈ ఏడాది మర్చి 16వ తేదీ నుంచి ఆదివాసీ, గిరిజన జిల్లా ఆదిలాబాద్ నుంచి నడక ప్రారంభించిన విక్రమార్క 17 జిల్లాలోని 36 శాసన సభ నియోజక వర్గాలను చుడుతూ 1360 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు. సుమారు మూడున్నర నెలల పటు మండుటెండలో అలుపు,సొలుపులను ఖాతరు చేయకుండా జనంతో అడుగులు వేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పాదయాత్ర ముగుంపు సందర్భంగా జులై 2న నిర్వహించిన “జన గర్జన” సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా రావడం విశేషం. ప్రస్తుతం భట్టీ విక్రమార్క మళ్ళీ మధిర నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.