అసెంబ్లీ ఎన్నికల వేళ టీ- బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి నేతలు బీజేపీ రాజీనామా చేయగా తాజాగా లేడీ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపీ విజయ శాంతి సైతం వారి బాటలోనే నడిచింది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు విజయశాంతి ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపింది. బీజేపీ నాయకత్వంపై విజయశాంతి గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన ఆమె దూరంగానే ఉంటున్నారు. బీజేపీ అగ్రనేతలు పాల్గొనే సభలకు సైతం ఆమె హాజరవ్వడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలకమైన అజిటేషన్ కమిటీ చైర్మన్‌గా పార్టీ నియమించి చైర్మన్ హోదాలో విజయశాంతి ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమె బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఇటీవల ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతికి చోటు దక్కలేదు. లేడి ఫైర్ బ్రాండ్‌గా పేరు ఉన్న విజయశాంతికి కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు దక్కకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మార్పు నేపథ్యంలోనే విజయశాంతికి ఈ జాబితాలో చోటు దక్కలేదని వార్తలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా విజయశాంతి పార్టీ మారుతున్నట్లు వార్తలు రాగా ఎట్టకేలకు ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి ఏ పార్టీ వైపు మొగ్గు చూపి ఏ రంగు కండువా దరిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.