తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ వివిధ రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధానంగా బిఆరేస్, కాంగ్రెస్, బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా ప్రచార తీరు గాడి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల ప్రచార సభల్లో నేతల ప్రసంగాల తీరును పరిశీలిస్తే రాజకీయాల కంటే వ్యక్తి గత విమర్శలు, దూషణలకు దిగుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఏ ఎన్నికల్లోనైనా సరే అధికార పార్టీ పై విపక్షాలు, ప్రతీ పక్షాలపై అధికార పక్ష నేతలు పరస్పర విమర్శలుఈ, ఆరోపణలు చేసుకోవడం సహజమే. దాంతోపాటు పాలనాపరమైన అంశాలు, హామీలు, పధకాల తీరు తెన్నులపై నేతల ఊకదంపుడు ప్రసంగాలు సాగేవి. ఎన్నికల్లో అదే రాజకీయం. కానీ ప్రస్తుత ప్రచారంలో నేతల మాటలు చూస్తుంటే ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత విషయాలపైనే ఘాటైన హస్త్రాలు సంధిస్తున్నట్టు అర్ధమవుతోంది. బాధ్యత గల ముఖ్యమంత్రి స్థాయి నేత నుంచి అధికార పార్టీ లోపాలను ఎత్తి చూపాల్సిన విపక్ష పార్టీల నేతలు ఒకరి పై ఒకరు వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల్లోకి వెళ్ళడం విచారకరమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కొన్ని సభల్లో ప్రసంగాల తీరును చుస్తే సామాన్యులకు సైతం ఆశ్చర్యం వేస్తోంది. నిజామాబాద్, నారాయణ్ ఖేడ్, గజ్వేల్ సభల్లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని బిఅరేస్, బిజెపి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.” అయ్య బక్కోడు.. కొడుకు తిరుగుబోతోడు… ప్రజలను ఆదుకోవాలంటే ఒక్కరూ ముందుకు రారు.. ఎర్రజొన్న రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయలేదు. పసుపు బోర్డు తెస్తానన్న“గుండోడు (అరవింద్) ” ఎక్కడికో పోయిండు… అని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పలువురికి మింగుడు పడడంలేదు. “బక్కోన్ని.. బక్కోన్ని అని చెప్పుకునే కేసీఆర్… లక్ష కోట్లు దిగమింగాడు.. నా నోరు తెరిస్తే కంపు అని కొడంగల్ లో కేసీఆర్ అంటుండు… ఇద్దరం పోదాం… డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకుందాం. ఎవరి నోట్లో కంపు ఉందో తేలుద్దాం… పొద్దున లేస్తే ఎత్తుడు పోసుడే నీ పని.. నీతో నాకు పోలికా?” అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఘాటైన వ్యాఖ్యల ప్రజలు ఎలా అర్ధం చేసుకున్నా అధికార పార్టీ శ్రేణులు మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాయి.
ఇదే తరహాలో ముఖ్యమంత్రి , బిఅరేస్ అధినేత చంద్రశేఖర్ రావు రేవంత్ రెడిపై చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ నేతలకు నచ్చడంలేదు. రేవంత్ టికెట్లు అమ్ముకున్నాడని వాళ్లనేతలే చెప్పార, చిప్పకూడు తిన్నా రేవంత్ కు సిగ్గు రాలేదని, ఎమ్మెల్యేలను కొనేందుకు పోయి దొరికి పోయాడని, రేవంత్ అరాచకాలు అన్నీ రేవంత్ రెడ్డికి నీతి లేదు, పద్దతి లేదు కెసిఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేటిఆర్ సైతం కోదాడ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు పబ్బుల గురించి మాత్రమె తెలుసనీ వ్యాఖ్యానించడం కుడా చర్చకు దారి తీసింది.
ఇక చొప్పదంటి నియోజక వర్గంలో జరిగిన సభలో బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కేటిఅర్,కెసిఆర్, కాంగ్రెస్ పార్టీల పై విరుచుకుపడ్డారు. యూజ్ లెస్ ఫెలో…. నిరుద్యోగులను బూతులు తిడతావా? కండకావరంతో ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడతున్నవ్… ఒక్కసారి ముడుతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల గతాన్ని గుర్తు చేసుకో…, మీ అయ్య ఉద్యోగాలిస్తానంటడు… నువ్వేమో నిరుద్యోగులను చెత్త నా కొడుకుల్లారా.. సన్నాసుల్లారా.. అంటావని కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలు మడిచి పెట్టుకోండని కాంగ్రెస్ పార్టీ పై వ్యాఖ్యలు చేసారు.
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో నేతలు ఈ విధంగా వ్యక్తిగత దూషణలకు వెళ్తే ప్రజా సమస్యలు పెడదోవ పట్టే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక, కిందిస్థాయి కార్యకర్తల మధ్య వాదనలు, కొట్లాటలకు దారితీసే అవకాశం లేకపోలేదని సూచిస్తున్నారు.