ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్ లకు ఎన్‌బీఏ లభించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నేషనల్ బోర్డు ఆప్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు నూతనత్వాన్ని ఆపాదిస్తున్నాయన్నారు. విద్యార్ధులకు ఉపాధి ఏ మేరకు లభిస్తుందన్న దానిని కూడా ఎన్‌బీఏ పరిగణనలోకి తీసుకుంటుదని, ఆక్రమంలో వారికి తక్షణం ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదనపు అన్ లైన్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. అయా కళాశాలలోని అన్ని విభాగాలు ఆధునికతను సంతరించుకున్నాయన్నారు. పరిసరాల పరిశుభ్రతతో మొదలు భవనాలకు రంగులు వేయటం, ప్రయోగశాలల ఆధునీకరణ, విద్యార్ధులకు వసతుల మెరుగు, సిబ్బంది రేషనలైజేషన్ ఇలా మార్పులకు ఆస్కారం ఏర్పడిందన్నారు. విద్యార్ధుల వసతి గృహాలు సైతం మెరుగుపరిచామని, ఫలితంగా ఒక కొత్త ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్ధ నడిచేందుకు మార్గం సుగమమైందని నాగరాణి తెలిపారు.