ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడింది కాదు, ఈ రాష్ట్రం పోరాటాలతో ఏర్పదిండి, త్యాగాల పునాదుల మీద పుట్టుకొచ్చిన రాష్ట్రం. ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వాలని, సామాజిక న్యాయం చేయాలని ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే ఆలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో దశాబ్దం కిందట సోనియాగాంధీ ఉక్కు సంకల్పం, కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అశేష జనసందోహం మధ్య తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అయన ప్రసంగం ఇలా సాగింది.దశాబ్ధ కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనై మానవ హక్కులకు భంగం కలిగి ఈ ప్రాంతములో ప్రజలు చెప్పుకుందామంటే ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక ఈ దశాబ్ధకాలంగా మౌనంగా భరించారు.

ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాచేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ప్రజా రాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, తెలంగాణ నిరుద్యోగులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్చ వచ్చింది. ఈ మంత్రి వర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడీగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా..ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టినా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా జ్యోతిరావుపూలే ప్రజా భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను, ఆకాంక్షలను, తమ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు.రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనను ఈ ప్రాంత అభివృద్ధిలొ మిలితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంతన్నగా మీ మాట నిలబెడతానని ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మాట ఇస్తున్నా. ప్రగతి భవన్ చుట్టూతా ఉన్న ఇనుప కంచెలను బద్దలుకొట్టినం. రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావుపూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల హక్కులను కాపాడటానికి ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భధ్రతలను కాపాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంతోనే పోటీపడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేద వాళ్లకు, నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ నిస్సహాయులు ఎవరు కూడా మాకు ఎవ్వరూ లేరు. ఏ దిక్కూ లేదనే పరిస్థితులను రానీయకుండా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ అండతో మల్లికార్జున ఖర్గే కి, నేతృత్వంలో రాహూల్ గాంధీ కి, సూచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించి మేము పాలకులం కాదు సేవకులం. మీకు సేవ చేయడానికే మీరు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా ఎంతో గౌరవంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలియజేస్తూ, ఈ రోజు ప్రభుత్వం ఏర్పడటానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ మువ్వన్నెల జెండాను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. మీ కష్టాన్ని శ్రమను గుర్తు పెట్టుకుంటా, గుండెల నిండా నింపుకుంటా, పదేండ్లు కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాయకుడిగా నేను తీసుకుంటా, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మన కుటుంబ సభ్యులుగా ఢిల్లీలో చూసుకుంటారు, ఈ రోజు నుంచి మా విద్యార్థి, నిరుద్యోగ , అమర వీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వేలాదిగా ఈ శుభకార్యక్రమానికి హాజరై తెలంగాణకు పట్టిన చీడ, పీడ నుంచి విముక్తి కలిగించారు. ప్రమాణ స్వీకారంలో మీరందరు కుటుంబ సభ్యులుగా పాల్గొని మీతోపాటు జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సహచర రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న చాలా రాజకీయ పార్టీలు, నా సహచర పార్లమెంటు సభ్యులు ఈ శుభ కార్యములో ఇందిరమ్మ రాజ్య ప్రక్రియలో పాల్గొన్నారు. వారందరికీ తెలంగాణ ప్రజల తరపున మీరందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలుపాలని కోరుకుంటున్నా మిత్రులారా. ధన్యవాదాల అంటూ రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించారు. అనంతరం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు మార్గం సుగమం చేస్తూ ఫైలుపై తొలి సంతకం చేశారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగిని రజినీకి ఉద్యోగం కల్పిస్తూ రెండో ఫైలుపై సంతకం ముఖ్యమంత్రి సంతకం చేశారు.