తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారిక నివాసంగా ఉన్న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఎలా ఉంటుందో సామాన్య ప్రజలకు ఇప్పటి వరకు తెలియదు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి స్వర్గీయ కోడెల శివ ప్రసాద్ రావు, జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాంప్ ఆఫీసుగా ఉన్న బేగం పేట లోని భవనాన్ని కూలగొట్టి రాజ సౌదం మాదిరిగా కేసీఅర్ మార్చారు. కానీ, మొన్నటి వరకు అందులోకి ప్రవేశించడానికి ఆయన అనుయాయులు, భద్రత సిబ్బందికి మాత్రమే అనుమతి ఉండేది. కనీసం ఆ భవనం ప్రహరీ గోడలు, గేటు కూడా ఎలా వుంటుందో చూడలేని, కనిపించని దయనీయ స్థితి. పైగా సుమారు 100 అడుగుల మేర జనం రాకపోకలు సాగించే రహదారిని కబ్జా పెట్టి ఇనుప కంచెను ఏర్పాటు చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కింది. ప్రగతి భవన్ ఎలా ఉంటుందో చూద్దామనే ఆలోచన కూడా రాకుండా చేశారు. అదే ఒక్కరోజులో మారిన పరిణామాలు జనం కళ్ళలో ఆనందం పెంచాయి. అడుగు వేయడానికే ఘనంగా ఉన్న ఆ భవనం “ప్రజా భవనం”గా మారడంతో ప్రతీ ఒక్కరిలో పట్టలేని ఆనందం వెల్లువిరుస్తోంది. కొత్త యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “ప్రజా దర్బార్” పేరుతో ప్రగతి భవన్ నిబంధనలను రాత్రికి రాత్రే బద్దలు కొట్టడంతో అసలు ఆ భవనం రుపు ఏమిటనేది బట్టబయలైంది. దర్బారులో రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన సామాన్యులు ప్రజా భవనం పచ్చిక బిళ్లలో భోజనాలు చేయడం, ప్రశాంతంగా సేద తీరిన సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి.