గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా పుట్టుకొచ్చిన ”బెల్టు షాపు”లు మూత పడనున్నాయి. రోడ్లు, జనావాస ప్రాంతాల్లోని రోడ్ల పక్కనే వెలిసిన వేలాది బెల్టు దుకాణాలను మూయించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు నడుం బిగిస్తోంది.దాదాపు అన్ని చోట్లా జిల్లా నాయకులూ, గల్లీ లీడర్ల కనుసన్నలలో బినామీ చిట్టాల కింద నడుస్తున్న వైన్ షాపులకు అనుకొనే అధిక సంపాదన కోసం “బెల్టు”లు చుట్టారు. వైన్ దుకాణంలో మందు కొన్నుక్కొని పక్కనే ఉన్న“బెల్టు”లో కూర్చొని తాగడం విచ్చలవిడిగా మారింది. దీంతో బంగాళాలలోని బార్లు షాపులు రోడ్ల మీదకు వచ్చినట్టయింది. ఒక్క బిర్యానీ తప్ప అన్ని రకాల “మంచింగులు, టచ్చింగులు,స్నాక్స్” ఇక్కడే తయారు చేసి చుక్కకు తోడు ముక్క అమ్మడం వల్ల రహదారులను రద్దీగా మారాయి. తెలంగాణలో 12,769 గ్రామాలు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 2620 వైన్ షాపులు నడుస్తున్నాయి. ఒక్కొక్క గ్రామంలో 2 నుంచి 5 బెల్టు షాపులు ఉన్నట్టు అనధికార లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన అంచనా వేస్తె సుమారు పాతిక వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోని బెల్టు షాపుల నుంచి పోలీసులకు, ఎక్సైజ్ సిబ్బందికి నెల మామూళ్ళు చేరడంతో వైన్ షాపుల యజమానులు, మందుబాబులు “బెల్టు”లతో రెచ్చి పోతున్నారు. అనేక చోట్ల సాయంత్రం నాలుగు గంటల నుంచి కళాశాలల నుంచి వచ్చే విద్యార్ధినులు, ఉద్యోగాలకు వెళ్లి వచ్చే మహిళలు మందుబాబులను చూసి బెంబేలెత్తుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రలో బెల్టు దుకాణాల నుంచి అధికారుల మామూళ్ళు, వాటి వల్ల ప్రజల సమస్యలను క్షుణ్ణంగా అవగాహనా చేసుకున్న ఆయన ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది. బెల్టు షాపుల వల్ల తాగుడుకు బానిసలయ్యే వారి సంఖ్య భారీగా పెరిగి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే ఫిర్యాదులు కూడా అధికంగా వస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి అనేక విజ్ఞప్తులు వచ్చినా మంత్రులు గాని, ఎక్సైజ్ అధికారులు గాని పెడచెవిన పెట్టారు. మొన్న జరిగిన ఎక్సైజ్ అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో చట్టాన్నిఅతిక్రమిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్టు తెలుస్తోంది. బెల్టు షాపుల మూసివేతను కట్టుదిట్టంగా అమలుపరుస్తే లక్షలాది కుటుంబాలకు మేలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ యోచనగా కనిపిస్తోంది. అంతేకాక, బెల్టు షాపులను మూసివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చినందున పక్కా వ్యూహంతో వాటిని రుపుమాపనుంది. ఇదే సందర్భంలో బార్లు, వైన్ దుకాణాల సమయాల్లో కూడా మార్పులు తీసుకురావడానికి అబ్కారి శాఖ కసరత్తు చేస్తోంది.