రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయమని కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల చెప్పారు. వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీని ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అని, ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని, అన్ని వర్గాలను కలుపుకుంటూ, అందరినీ కలుపుతూ పని చేస్తుందని పేర్కొన్నారు. ఒక క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత నన్ను తీవ్రంగా బాధించిందని, సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందనడానికి ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ పై నమ్మకాన్ని నాతో పాటు ప్రజలందరిలో పెంచిందని, తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ నుంచి దూరంగా ఉన్నట్టు వివరించారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్టీపీ ను కాంగ్రెస్ లో విలీనం చేసినట్టు స్పష్టం చేశారు.