రాజకీయాల్లో”అరటి పండ్లు”…!

banana c

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో “అరటి పండు”పార్టీల ఎత్తుగడలు అంతుపట్టకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన, వై.ఎస్.షర్మిల ఆధ్వర్యం లోని వై.ఎస్.ఆర్.తెలంగాణ (వైఎస్ఆర్ టి) పార్టీలు ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలవ్వగానే తమ బలం ఎంత ఉన్నదనే కనీస విషయాన్ని అంచనా వేసుకోకుండా బరిలోకి దిగడం వెనుక అసలు రహస్యం ఏమిటనే  కోణంలో చర్చలకు తెర లేస్తోంది. తెలంగాణ శాసనసభకు గత నెలలో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బి.అర్.ఎస్.కి తామే సమఉజ్జీలం అనే విధంగా జనసేన, వై.ఎస్.ఆర్.టి.పార్టీలు దర్పం చూపాయి. మొదట 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ఏకపక్షంగా ప్రకటించిన జనసేన ఆ తర్వాత బిజెపితో చేతులు కలిపి చివరకు 8 చోట్ల పోటీకి సిద్ధపడింది. కానీ, ఏ ఒక్క అభ్యర్థి కూడా డిపాజిట్ దక్కించుకోలేక పోయారు.  పవన్ కళ్యాణ్ అభిమానుల పుణ్యాన మూడు, నాలుగు వేల ఓట్లకే పరిమితం అయ్యారు.

ఇక షర్మిల విషయానికి వస్తే తెలంగాణ ఎన్నికల్లో కేసీఅర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికే రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ  వై.ఎస్.ఆర్.టి.పార్టీని ఏర్పాటు చేశారు. బి.అర్.ఎస్. పార్టీకి తమ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అనే రీతిలో పాదయాత్రలు, ధర్నాలు చేసి కొన్ని నెలల పాటు హడావిడి చేశారు. నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సమయంలో షర్మిల తీసుకున్న అనూహ్య నిర్ణయం నేరుగా వై.ఎస్.ఆర్.టి.పార్టీపై పడింది. తెలంగాణ ఆడపడుచుననీ, ఆదరించండి అంటూ పార్టీని ఏర్పాటు చేసి, తీరా ఎన్నికల బరిలోకి అడుగు పెట్టే సమయంలో వెనుకడుగు వేసి పోటీ నుంచి తప్పుకున్నారు.కాంగ్రెస్ పార్టీకి వంత పలకడంతో ఆమెను నమ్ముకున్న అనేక మంది నేతలను నిరాశ పరిచింది. కాంగ్రెస్ పార్టీతో తెరవెనుక ఏమీ జరిగిందనే విషయం కూడా ఆమెతో సన్నిహితంగా ఉన్న నేతలకు, శ్రేణులకు కూడా తెలియదు. తెలంగాణలో జండా ఎత్తేసిన షర్మిల తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పై తన దృష్టి సారించారు. అక్కడ ఏకంగా సొంత అన్నయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైనే కాలు దూయడానికి సిద్దపడుతోందని ఇప్పటి వరకు అందుతున్న సమచారం. ఎన్నికల సమయంలో తెలంగాణలో అనుసరించిన విధానాన్ని, అవే ఆలోచనలను షర్మిల ఆంధ్రలో కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక దశలో వై.ఎస్.ఆర్.టి.పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే వాదనలు వినిపించాయి. కానీ,  ఆమె మాత్రం చివరి నిమిషంలో కేవలం పార్టీనే పోటీ నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఆమె అనుసరిస్తున్న వైఖరి, వేస్తున్న అడుగులు కూడా అదేవిధంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాలో బలంగా ఉన్న వైసిపి, తెలుగుదేశం పార్టీలను సరైన రాష్త్ర స్థాయి నాయకత్వం లేని కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొకొంటుందనే అసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికలకు పట్టుమని మూడు, నాలుగు నెలల సమయం కూడా లేదని, ఇప్పుడు చక్కర్లు కొడుతున్న పుకార్ల మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినా ప్రస్తుత పరిస్థితిలో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఆటలో అరటిపండు మాదిరిగా పోటీ చేసిన జనసేన తరహాలోనే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో షర్మిల ప్రయత్నాలు కనిపిస్తున్నాయని సీనియర్ రాజకీయ నేతలు తేల్చి చెబుతున్నారు. తెలంగాణాలో ఎలాంటి ప్రభావం చూపని వై.ఎస్.ఆర్.టి.పార్టీ, దాని అధినేత పాదయాత్రలు, ఆంధ్రలో కాంగ్రెస్ గొడుగు పట్టుకొని తిరిగితే అక్కడి ప్రజలు ఎలా స్పందిస్తారో కొన్ని రోజులు వేచి చూడాలి. ఎన్నికల సమయంలో కొందరు రాజకీయ నేతలు చేస్తున్న ఇలాంటి చర్యల వల్ల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఓటర్లలో మాత్రం అసహనం కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *