తన కుమారుడు రాజా రెడ్డి పెళ్లికి అనేక మంది రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నామని,ఇందులో భాగంగానే చంద్రబాబు కుటుంబాన్నికూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరినట్టు షర్మిల చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్. షర్మిల కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానాన్ని అందజేసి కుటుంబ సమేతంగా తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కొద్దిసేపు చర్చలు జరిపినట్టు అందులో అధిక సమయం జననేత రాజశేఖరరెడ్డి గురించి, వారి మధ్య ఉన్న స్నేహం , ఇరువురు రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానంపై చంద్రబాబు అన్నీ గుర్తు చేసుకున్నట్టు వివరించారు. రాజశేఖర్ రెడ్డి, బాబుల ఇద్దరి ప్రయాణం, జీపులో కలిసి తిరగడం, పొద్దున్నుంచి రాత్రి వరకు కలిసి ఉండటం, ఇద్దరూ ఢిల్లీకి కలిసి వెళ్లడం, సీఎం పదవి కోసం ఇద్దరూ చేసిన ప్రయత్నాలు వంటి గతాలను నెమరు వేసుకున్నట్టు షర్మిల తెలిపారు. చంద్రబాబుకు ఒక క్రిస్మస్ కేక్ కేవలం చంద్రబాబుకు మాత్రమే పంపలేదని, కేటీఆర్, కవిత, హరీశ్ రావు వంటి వారికి కూడా పంపించినట్టు పేర్కొన్నారు. రాజకీయాలే జీవితం కాదని, రాజకీయం ఒక వృత్తి వంటిదే అని రాజకీయ ప్రత్యర్థులుగా ఒక మాట అనుకోవడం సహజం అన్నారు. చంద్రబాబును కలవడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. రాజశేఖరరెడ్డి కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబును పిలిచారని, చంద్రబాబు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారని గుర్తు చేశారు. పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని చంద్రబాబు మాట ఇచ్చినట్టు షర్మిల తెలిపారు..