ప్రజా పాలనే రాజ్యాంగం…

IMG 20240125 WA0040

ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాతలను, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయులను గుర్తు చేసుకోవాలని కోరారు. ప్రజల పోరాటంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కొత్త ప్రభుత్వం రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటుందని అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే తమ ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని, ప్రజలే పాలకులనే జవాబుదారీ తనంతో పని చేస్తుందని తెలిపారు. నియంత పోకడలను పాతర పెట్టి, రాజ్యాంగ బద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని రేవంత్ స్పష్టం చేశారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ స్పూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి సిద్ధపడిందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *