ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. ఏ విపక్షమైన సమయం, సందర్భం, సమస్యల తీవ్రతను ప్రామాణికంగా తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా వ్యూహ రచనలు చేసుకొని అధికార పక్షం పై పోరాటానికి సిద్ధం అవుతాయి. కానీ, తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న తంతు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీ ముసుగులో ప్రజల ముందు అనేక హామీలను గుప్పించి అధికారం చేజిక్కించుకున్న భారత రాష్ట్ర సమితి,(బి.అర్.ఎస్.) పదేళ్ల పాలనలో అనేక హామీలను తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ప్రశ్నించే గొంతులను తొక్కిపెట్టి, వాటిలో కొన్ని గొంతుకలకు ఏదో ఒక ఏర చూపి తోకకి చుట్టుకున్న సందర్భాలు కేసీఅర్ పాలనలో విమర్శలకు దారి తీశాయి. కొద్ది రోజులుగా ఎం.ఎల్.ఎ. కెటిఆర్ కొత్త ప్రభుత్వం పై పలురకాలుగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయడం అనేక చర్చలకు దారి తీస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను ఆచరణలోకి తెస్తామని, వాటిలో రెండు హామీలు ఇప్పటికే కార్యరూపం దాల్చాయని అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెబుతున్నా బి.అర్.ఎస్. పెడచెవిన పెట్టడం ఆ పార్టీ నేతల్లోనే కొందరికి నచ్చడం లేదు. హామీల అమలుకు ఇంకా నలభై రోజులకు పైగా గడువు ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా “కరెంటు బిల్లులు చెల్లించ వద్దని, అధికారులను నిలదీయండి” అంటూ మంత్రిగా పనిచేసిన కెటిఆర్ సహా కొందరు ఎం.ఎల్. ఎ.లు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం అర్థ రహితంగా ఉందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎదురు దాడికి సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం.

తెలంగాణ ఏర్పాటుకు ముందు బి.అర్.ఎస్.అధినేత కేసీఅర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అటు కాంగ్రెస్,ఇటు బిజెపిలు తవ్వుతున్నాయి. అప్పటి ఒక బహిరంగ సభలో దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తామని, 2014 ఆగస్టు 15న దళిత మహిళలకు 3 ఎకరాల భూమి ఇస్తామని సాక్షాత్తూ కేసీఅర్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మళ్ళీ తెరపైకి తీసుకురానుంది. పదేళ్లుగా రెండు కీలక హామీలను నెరవేర్చాలేని బి.అర్.ఎస్. నేతలు మొన్ననే అధికారంలోకి వచ్చి, గతంలోని లోపాలను సరిదిద్దుతున్న తమ పై కెటిఆర్ వంటి నేతలు కావాలనే ఒత్తిడి పెంచే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఓటమిని జీర్ణించుకోలేని బి.అర్.ఎస్. ఓటమికి అసలు కారణాలను అన్వేషించాల్సింది పోయి కాంగ్రెస్ హామీలను ప్రజలు గుడ్డిగా నమ్మారనే రీతిలో మాట్లాడడం, భాగ్య నగరంలో తమకు బలం బాగా ఉన్నట్టు ప్రచారం చేసుకోవడం కూడా సీనియర్ నేతలను ఆశ్చర్య పరుస్తోంది. దాదాపు పాతిక ఏళ్ళ కిందటే హైదరాబాదులో అభివృద్ధికి అంకురార్పణ జరిగిందనే నిజం నగర పౌరులందరికీ తెలిసిందే. భాగ్యనగరానికి ఉన్న ప్రత్యేక వనరులు,అనేక రకాల సదుపాయాల వల్ల ఏ పార్టీ అధికారంలో ఉన్న ఏటేటా అభివృద్ది జరగాల్సిందే. ఇలాంటి ప్రాథమిక విషయాన్ని మరచిపోయి అదంతా తమే చేసినట్టు మొన్నటి ఎన్నికల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు చూపించిన బి.అర్.ఎస్. నేతలు నగర ప్రజల అండ ఉందనే అపోహలో ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. లోక్ సభ ఎన్నికలు ఎత్తుగడలో భాగంగా బి.అర్.ఎస్. ఈ విధంగా వ్యవహరిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.