తెలంగాణ శాసన సభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన భారత రాష్ట్ర సమితి (భారాస) నేతల్లో అసహనం పరాకాష్టకు చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆవేశంలో యువ నేతలు గత చరిత్రను మరచిపోతున్నట్టు స్పష్టం అవుతోంది. ప్రజల కోసమో లేక అధికారం లేదనే కోపమో తెలియదు గానీ కొద్ది రోజులుగా కెటిఆర్, కవిత, సుమన్, శ్రీహరి వంటి భారాస నేతలు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యవహరిస్తున్న తీరు అంతుపట్టకుండా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారాస హయాంలో జరిగిన లోతైన లోటుపాట్లను వెలికి తీస్తూ దిద్దుబాటు చర్యలతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వంపై పెత్తనం చెలాయించే మాదిరిగా భారాస నేతలు వ్యవహరిస్తున్నారనే బలమైన విమర్శలు వస్తున్నాయి.
బాల్క సుమన్ చెప్పులు చూపడం, కెటిఆర్, కడియంలు ఏకంగా ప్రభుత్వమే కూలిపోతుందని మాట్లాడడం, పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పై 11వ తేదీ లోపు ప్రభుత్వం తెల్చకుంటే మహాధర్నాకు దిగుతామని కవిత హెచ్చరించడం వంటి అంశాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపం పై విజిలెన్స్, ఇతర విచారణ సంస్థల నివేదికల ఆధారంగా ఇద్దరు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల పై చర్యలు తీసుకోవడం, కేసీఅర్ హయాంలో పోలీస్ బాస్ గా అధికారం చెలాయించిన మాజీ డిజిపి మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కి ఛైర్మన్ గా నియమించడం భారాస నేతలకు ఎందుకు మింగుడు పడడం లేదనేది అర్థం కానీ విషయం. ఒకప్పుడు కెసిఆర్ తో అంటకాగిన మహేందర్ రెడ్డిని వెంటనే తొలగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన ప్రతిపక్షం ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో తల దూర్చడం కొత్తగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, గురువు చంద్రబాబు నాయుడు బాటలో శిష్యుడు రేవంత్ రెడ్డి నడుస్తున్నారని, ఆయనలో “పచ్చ” నెత్తురు ప్రవహిస్తోంది అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఒకప్పుడు కేసీఆర్, కడియం శ్రీహరి, శ్రీనివాస్ యాదవ్, యర్రబల్లి వంటి నేతలూ చంద్రబాబు నాయకత్వంలో పని చేసిన వారు కాదా అని కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. భారాస నేతలు అసహనంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు మారోసారి గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానిస్తున్నారు. మూలాలు మరిచిపోయి మాట్లాడడం సమంజసంగా కాదని సూచిస్తున్నారు. “గులాబీ”కండువా కప్పుకున్న అనేక మంది నేతల్లోనూ “పచ్చ”రక్తం ప్రవహిస్తోందని గుర్తు చేస్తున్నారు.