ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులు అబుదాబిలో పర్యటించిన సందర్భంగా యూఏఈ దేశంతో ఎనిమిది వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు, కానీ గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి మాత్రం పట్టించుకోలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ బి.ఎం. వినోద్ కుమార్, కన్వీనర్ మంద భీంరెడ్డి వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ స్వదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని కోరారు. ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలని, ఈసీఆర్, ఈసీఎన్ఆర్ ఈ రెండు రకాల పాస్ పోర్టు దారులకు బీమా సౌకర్యం కల్పించాలని, రెండు రకాల పాస్‌పోర్ట్ వర్గీకరణను రద్దు చేసి ఒకే రకం పాస్‌పోర్ట్ కు అనుమతించాలన్నారు. భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలని, గల్ఫ్ నుంచి తిరిగి వచ్చే వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించాలని,విదేశీ మారకద్రవ్యం పంపే వారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం మాదిరిగా రెండున్నర శాతం ప్రోత్సాహకం అందించాలని విజ్ఞప్తి చేశారు.