కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్ రైతులపై పోలీసులు ‘సోనిక్ ఆయుధాల’ను ప్రయోగించారు. ఒకే దిశలో కర్ణభేరీలు పగిలేలా శబ్దాలను విడుదల చేయడం సోనిక్ ఆయుధాల ప్రత్యేకత. లాంగ్ రేంజ్ అకూస్టిక్ డివైజ్(ఎల్‌ఆర్‌ఏడీ)గా పిలిచే సోనిక్ ఆయుధాలను సాధారణంగా సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేయడానికి వినియోగిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాడుతున్నారు. అమెరికా సైన్యం అమ్ముల పొదిలో 2000 సంవత్సరం నుంచే సోనిక్ ఆయుధాలుండగా 2013లో ఢిల్లీ పోలీసులు వీటిని కొనుగోలు చేశారు.
నాలుగేళ్ల క్రితం రైతుల ఛలో ఢిల్లీ-1.0లో సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించినా.. ట్రాక్టర్లతో బారీకేడ్లను బద్ధలు కొట్టుకుంటూ వచ్చిన రైతులు.. ఎర్రకోటపై తమ జెండాను ఎగురవేశారు. ఛలో ఢిల్లీ-2.0 ప్రారంభమైన నేపథ్యంలో రైతులను ఢిల్లీ శివార్లలోనే కట్టడి చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఎల్‌ఆర్‌ఏడీలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా మన చెవులు 90 డెసిబుల్స్ వరకు శబ్దాలను వినగలవు. శబ్దం తీవ్రత అంతకు మించితే కర్ణభేరీ దెబ్బతింటుంది. ఎల్‌ఆర్‌ఏడీలు 160 డెసిబుల్స్ వరకు శబ్దాలను విడుదల చేస్తాయి. ఇవి ఒకే దిశలో 5 నుంచి 60 డిగ్రీల వ్యాసార్థంలో శబ్దాలను పంపుతాయి. ఎల్‌ఆర్డఈఏ సామర్థ్యం 2కిలో హెర్డ్‌జ్‌ల వరకు ఉంటుంది. అంటే ఒకే ఫ్రీక్వెన్సీతో 2.4 కిలోమీటర్ల దూరం వరకు భారీ శబ్దాలను పంపగలవు. ఢిల్లీ పోలీసులు సోనిక్ ఆయుధాలను ప్రయోగించినట్లు ఎన్‌డీటీవీ కథనాలను ప్రసారం చేసింది.డ్రోన్లకు పతంగులతో విరుగుడు ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు హరియాణా పోలీసులు డ్రోన్లతో టియర్‌గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. దీంతో పలువురు రైతులు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ నేపథ్యంలో టియర్‌గ్యాస్ డ్రోన్లకు విరుగుడుగా రైతులు పంతంగులను ఎగురవేశారు. పతంగుల ధారాలకు చిక్కుకుపోయి డ్రోన్లు కుప్పకూలిపోతాయి. ఇక భాష్పవాయువు ప్రభావాన్ని తగ్గించేలా ఎక్కడికక్కడ నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. రైతులు వాటర్ బాటిళ్లు, కాటన్ దుస్తులను తమ దగ్గర పెట్టుకున్నారు. బాష్పవాయువు ప్రయోగం జరిగినప్పుడు కాటన్ దుస్తులను తడిపి ముఖానికి కట్టుకోవడం వల్ల దాని దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు హరియాణా పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో జరిపిన కాల్పుల్లో 40 మంది రైతులు గాయపడ్డారు. ఢిల్లీ శివార్లలో ముఖ్యంగా పంజాబ్-హరియాణా సరిహద్దుల్లోని శంభు వద్ద, ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘ్వాలా-ఖనౌరీ రహదారిని రైతులు దిగ్బంధం చేశారు. ఆ ప్రాంతాల్లో సుమారు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో లక్ష మందికిపైగా రైతులు ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతులు ఢిల్లీ వైపు చొచ్చుకెళ్లకుండా ఉండేందుకు హరియాణా పోలీసులు సిమెంట్ దిమ్మెలు, బ్యారీకేడ్లను ఏర్పాటు చేశారు. గతంలో రైతులు ట్రాక్టర్లతో బ్యారీకేడ్లను తప్పిస్తూ ముందుకు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లు వస్తే వాటి టైర్లు పంక్చర్ అయ్యేలా రోడ్లపై మేకులు, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. ముందుకు దూసుకొచ్చే రైతులు రోడ్లపై జారిపడేలా, వాహనాలు అదుపుతప్పేలా ల్యూబ్రికెంట్స్‌ను వేశారు. ఓవైపు రైతుల ఆందోళన, మరోవైపు పోలీసుల దిగ్బంధనాలతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైతు నేతలతో కేంద్రం చర్చలురైతు సంఘాల నేతలు మంగళవారం నుంచే చర్చలకుడిమాండ్ చేస్తుండగా.. కేంద్రం నుంచి ఆ దిశగా చర్యలను ప్రారంభించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అర్జున్ ముండా, పీయూష్ గోయల్ ఉదయం భేటీ అయ్యి రైతు నేతల డిమాండ్లు, పోలీసుల చర్యలపై చర్చించారు. రైతు నేతల డిమాండ్లలో కొన్నింటికి కేంద్ర మంత్రులు ఓకే చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెస్పీకి చట్టబద్ధతపై ఇప్పటికిప్పుడు చట్టం చేయలేమని, అన్నివర్గాలు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని వివరించారని సమాచారం.