27న మరో “రెండు”…

Screenshot 20240223 173858 WhatsApp

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్, తెల్ల‌ రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి పేద‌వానికి 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌రవుతార‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ, ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచామ‌న్నారు. మేడారం మ‌హా జాత‌ర సంద‌ర్బంగా శ్రీస‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిలువెత్తు బంగారం (బెల్లం), ప‌సుపు, కుంకుమ‌,గాజులు స‌మ‌ర్పించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

అనంత‌రం రేవంత్ విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేస్తామ‌న్నారు. రైతుల‌కు ఇచ్చిన రూ.2ల‌క్ష‌ల రుణ‌ మాఫీపై బ్యాంకుల‌తో చ‌ర్చిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే రైతుల‌కు శుభ‌వార్త చెప్ప‌బోతున్నామ‌న్నారు. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ప‌రిమితిని రూ.5 ల‌క్షల నుంచి రూ.ప‌ది ల‌క్ష‌ల‌కు పెంచామ‌ని గుర్తు చేశారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ప్ర‌తిహామీని అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి పున‌రుద్ఘాటించారు. అధికారంలోకి వ‌చ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని, 6,956 మంది స్టాఫ్ న‌ర్సుల నియామ‌కం, 441 సింగ‌రేణి ఉద్యోగులు, 15 వేల పోలీసు, ఫైర్ డిపార్టుమెంట్ ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. మార్చి 2వ తేదీన మ‌రో 6 వేలపైచిలుకు ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌బోతున్నామ‌న్నారు. రెండు ల‌క్ష‌ల ఖాళీలు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పామో దానికి త‌గిన‌ట్లు 25 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని, వాటిని ప్ర‌జ‌ల‌కు క‌నిపించేలా.. కుళ్లుకుంటున్న వారికి వినిపించేలా ఎల్‌బీ స్టేడియంలో నే వేలాది మంది స‌మ‌క్షంలో వారికి నియామ‌క ప‌త్రాలు ఇచ్చామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వ‌లేదంటూ మామా అల్లుళ్లు,తండ్రీ కొడుక‌లు త‌మ ప్ర‌భుత్వంపై గోబెల్స్‌లా అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో యువ‌కుల‌కు ఉద్యోగాలు క‌ల్పించేందుకు ప‌ది స్కిల్ యూనివ‌ర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందిస్తున్న‌ట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *