జాగిలాలది నిస్వార్థ ప్రేమ..

IMG 20240223 WA0085 1

ఏ రకమైన షరతులు లేని నిస్వార్థ ప్రేమకు జాగిలాలు చక్కని నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా అన్నారు. మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటిఏ)లో 23 వ పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో డిజిపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగిలాలు ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీకలుగా అభివర్ణించారు. పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని అన్నారు. ఎన్నో కేసుల దర్యాప్తులో జాగిలాలు నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాయని తెలిపారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో జాగిలా లు కనబరుస్తున్న ప్రతిభ, క్రమశిక్షణలను చూసి ముగ్దుడనయ్యానని అన్నారు. ఐఐటిఏ అందిస్తున్న శిక్షణ దేశంలోనే ఎంతో పేరు తెచ్చిందని, వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు తమ రాష్ట్ర జాగిలాలకు శిక్షణ ఇప్పించాలని కోరారు.

IMG 20240223 WA0086

ఇప్పటికే పలు రాష్ట్రాల జాగీలాలకు ఐఐటిఏ శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు .ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఇటీవల జాతీయ స్థాయి డ్యూటీ మీట్ లో పథకాలు సాధించారని ప్రశంసించారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ…. దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సాధించిన విజయాలలో పోలీస్ జాగిలాలు ప్రశంసాపూర్వక పాత్రను నిర్వహించాయని వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఐఐటిఏ సిబ్బంది ఎంతో ప్రగతి సాధించిందని కొనియాడారు. ఐఐటిఏ కృషిని ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులు ప్రశంసించడంలో అతిశయోక్తి లేదని, వారి శ్రమకు ఇది నిదర్శనమని అభివర్ణించారు. భవిష్యత్తులో ఐఐటిఏ సిబ్బంది మరిన్ని విజయాలు సాధించాలని అడిషనల్ డిజిపి ఆకాంక్షించారు.

ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డిఐజి తఫ్సీర్ ఇక్బాల్ ప్రారంభోపన్యాసం చేస్తూ బీహార్ ,మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి పంపిస్తున్న పోలీస్ జాగిలాలకు ఐఐటిఏ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 21 జాగిలాలు 28 మంది కేనైన్ హ్యాండర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ట్రాకర్, స్లిప్పర్ ,అసాల్ట్ మరియు నార్కోటిక్ ఫీల్డ్లలో శిక్షణ కొనసాగిందన్నారు. జాగిలాలలో లాబ్రడార్, జర్మన్ షెఫర్డ్ ,బెల్జియన్ ,మలినోయిస్ కాకర్ పానియల్ జాతులు ఉన్నాయన్నారు. 2004వ సంవత్సరంలో 11 జాగిలాలతో ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం దాదాపు 771 జాగిలాలకు ఇప్పటివరకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాగిలాలకు వాటి హండర్లకు బహుమతి ప్రధానం చేశారు .అనంతరం జాగిలాలు వివిధ ప్రదర్శనలు ఇచ్చాయి . సెల్యూట్ ,ఫ్లవర్ బొకే డ్రిల్స్ , ఒబిడియన్స్ , రెఫ్యూజల్ ఆఫ్ ఫుడ్, లగేజ్ సెర్చ్, క్రాస్ వాక్ ,క్రైమ్ సీన్ డ్రిల్ ,క్యాచ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రదర్శనలు ఇచ్చాయి ఈ సందర్భంగా డ్రోన్ షో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్ కు డిజిపి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఐజిపి, ఎం.డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎం.రమేష్, ఆర్పి ఎఫ్ ఐజిపీ అరోనా సింగ్ ఠాకూర్, ఆర్పిఎఫ్ డిఐజి ఎస్. జెడ్ ఖాన్ , ఇంటెలిజెన్స్ ఎస్పీ భాస్కరన్ , రాజేంద్రనగర్ డిసిపి సి.హెచ్ శ్రీనివాస్, ఐఐటిఏ ఇన్చార్జి ప్రిన్సిపల్ అరవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *