తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల వేటలో ఉన్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండడం, బారత రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్, బిజెపి వైపు అడుగులు వేయడంతో వివిధ జిల్లాల్లో ఆశావాహుల సంఖ్య అధికామవుతోంది. కాంగ్రెస్, భారాస, బిజెపిలలోని సీనియర్ నేతలు, గత శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి ఆయా పార్టీల అధినేతల బుజ్జగింపులు, హామీలతో వెనక్కి తగ్గిన నాయకులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి పరిచయాల మేరకు వారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పావులు కదిపే పనిలో ఉన్నారు. గత ఇరవై రోజులుగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ హడావుడి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారాస నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారు వివిధ స్థాయిల్లో మంతనాలు జరుపుతున్నారు. ఇదే సందర్భంలో కొందరు ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న వారూ, రాజీనామా చేసి రాజకీయాల బాట ఎంచుకున్న ప్రజా వైద్య శాఖ మాజీ సంచాలకులు శ్రీనివాస్ వంటి వారు కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. కొంత కాలంగా ప్రజా సేవ వైపు దృష్టి సారించి ఆ మార్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న అదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) సంచాలకులు డాక్టర్ రాథోడ్ జైసింగ్ సైతం రాజకీయ ఆరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఆదివాసీ జిల్లా అదిలాబాద్ లో పుట్టి పెరిగిన గిరిజన బిడ్డ కావడం, జిల్లాలో ప్రత్యేకంగా పార్లమెంట్ నియోజక వర్గంలోని ప్రజలు, వివిధ సంఘాలతో సత్సంబంధాలు కలిగి ఉండడాన్ని రానున్న ఎన్నికల్లో అవకాశంగా మాలచుకోవాలని ఆయన యోచిస్తున్నారు. అంతేకాక, ఆ ప్రాంతంలో ప్రజా సమస్యల పట్ల పూర్తీ స్థాయి అవగాహన కలిగి ఉండడం, ఇప్పటికే పలురకాల స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించి స్థానికులకు దగ్గర కావడం కూడా కలిసి రావచ్చని రాథోడ్ భావిస్తున్నారు. రాజకీయంగా ప్రజాసేవలోకి వస్తే ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు తాగునీరు, విద్య, వైద్య, గృహ సదుపాయాల అభివృద్ధి కోసం పోరాడి సాధించ దానికి అవకాశం ఉంటుదాని భావిస్తున్నారు. ఇవే వివరాలను ఆయన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్టు సమాచారం. తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో ఆయన అందించిన సేవలు, రాజకీయాలపై ఉన్న ఆసక్తి, ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ పరిశీలనలోకి తీసుకుంటుందని రాథోడ్ బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం గెలుపు గుర్రాల వేటలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం అదిలాబాద్ విషయంలో ఆవివాదాస్పదుడైన రాథోడ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. అన్ని వర్గాల వారితో మమేకం అయిపోయే ఈ డాక్టర్ అభ్యర్ధన పై అధిష్టానం ఎలాంటి నిర్ణయమ తీసుకుంటుందో వేచి చూడాలి.