వర్క్ ఫ్రమ్ “జైల్”…

kejri jail

మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జల వనరుల శాఖకు జారీ చేశారు.ఈ రోజు సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి అరవింద్ ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో ఢిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనే అనుమానం చాలా మందికి కలిగింది. కేజ్రీవాల్ ను జైలుకు పంపితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని ప్రభుత్వాన్ని నడిపేందుకు జైలు లోనే కార్యాలయం నిర్మిస్తామని పంజాబ్‌ సీఎం చెప్పారు. పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరని తెలిపారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా పార్టీని స్థాపించారని గుర్తు చేసుకున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేమని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదని, చట్టం ప్రకారం నేరం రుజువయ్యేంత వరకు జైలు నుంచే పని చేయవచ్చని మాన్‌ స్పష్టం చేశారు. సుమారు 2 గంటల విచారణ జరిపిన అనంతరం మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. అనంతరం కోర్టు కేజ్రీవాల్ కు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపింది. కేజ్రీవాల్ అరెస్టుపై పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండి పడ్డారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్టు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *