మీ కేసులు చూసుకో – మా పై కాదు…

ktr media c

రాజకీయంగా దారులు మూసుకుపోతున్నాయి, మొన్నటి వరకు తమ వారే అనుకున్న ఒకరొ క్కరు జారుకుంటున్నారు, తండ్రి బయటకు రాలేని వింత పరిణామం, సొంత చెల్లెలు జైలు పాలుకాబోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత, మీడియా కార్యాలయాలనే కంట్రోల్ రూమ్ లుగా మార్చుకున్న గుట్టు రట్టవుతున్న తరుణం, నమ్ముకున్న అనేక మందిని కేసులు వెంటాడే దుస్థితి నెలకొంది, తమకు నచ్చని మీడియా, పత్రికలపై ఏమీ చేయలేని దయనీయ స్థితి అందుకే చివరికి సోషల్ మీడియా పై అక్కసు. తెలంగాణా రాష్ట్రానికి సాంకేతిక శాఖ మంత్రిగా పని చేసిన కల్వకుంట్ల తారక రామారావు ఇప్పుడు సామాజిక మాధ్యమం పై విరుసుకు పడడం విడ్డూరంగా ఉంది. పదేళ్ల అధికారంలో ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే దానికి ప్రస్తుతం పోలీసు శాఖ నిఘా విభాగంలో వెలుగు చూస్తున్న నిజాలే నిలువెత్తు సాక్ష్యం. విపక్షాలని, సొంత పార్టీ నేతలను, పేరున్న వ్యాపారులను తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనే దుర్మార్గ ఆలోచనలతో ఏకంగా  ఐ న్యూస్ వంటి మీడియా కార్యాలయాలనే నిఘా కంట్రోల్ రూమ్ లుగా మార్చుకున్న ఘనత భారాస ప్రభుత్వానిదన్న వాస్తవం ఇప్పటికే తేటతెల్లం అయింది. గత ఏడేళ్ల కాలంలో సోషల్ మీడియాని భారాస ఎన్ని రకాలుగా ఉపయోగించుకుందో ఐటి మంత్రిగా పని చేసిన కెటిఆర్ కి తెలియని రహస్యం కాదు. అప్పట్లో స్టోరీ బోర్డుల పై విషయాన్ని రాయించి మరీ అరగంట, 20 నిమిషాల ప్యాకేజీల రూపంలో ప్రచారం చేసిన   టి న్యూస్, దాని అనుబంధ సోషల్ మీడియా సంస్థలు ఎక్కడున్నాయనే విషయం ఆయనకు తెలుసు. ఏళ్ల తరబడి ఏకంగా పార్టీ కార్యాలయంలోనే టివి ఛానల్ నడిపిన చరిత్ర కూడా భారాసకే దక్కింది. మొన్నటి వరకు ఏ సందర్భంలో ఏ విషయాన్ని ఎలా మలిచి “నెటిజన్ల”కు అందించాలో ఆ మీడియా కంటే ఎక్కువగా తల పండిన పాత్రికేయులకు కూడా తెలిసేది కాదు. అలాంటిది ఈ రోజు కవిత అరెస్టు, కాళేశ్వరం సమస్య, ఫార్ములా “ఇ” చెల్లింపులు, ఇంటెలిజన్స్ భాగోతం, ధరణి దరువు, గొర్రెల కొనుగోళ్లు వంటి వ్యవహారాల్లో వాస్తవాలను తెలంగాణా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్న సామాజిక మద్యమాలపై కేటీఆర్ విరుసుకు పడి బెదిరించే వ్యాఖ్యలు చేయడం నిజంగా భావ స్వేచ్ఛను హరించి ,అణచి వేసే చర్యగా పత్రికా రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ktr media in
“ఎక్స్” లో కేటీఆర్ వ్యాఖ్యలు..

మొన్నటి వరకు నిజాలను సమాజానికి చెప్పకుండా జర్నలిస్టులను, జర్నలిజం గొంతు నొక్కారు అనడానికి కేసీఆర్ , కేటీఆర్ లు నిర్వహించిన అనేక విలేకరుల సమావేశాలు ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడిప్పుడే స్వేచ్ఛను ఆస్వాదిస్తున్న పత్రికా రంగంపై కేటీఆర్ తన నైజాన్ని వెళ్లగక్కడం పాత్రికేయ లోకం తీవ్రంగా గర్హిస్తోంది. ఏలాంటి యాజమాన్య ఒత్తిడులు లేకుండా నిజాలను నిర్భయంగా ప్రేక్షకులకు, పాఠకులకు అందిస్తోంది కేవలం వెబ్ సైట్ లు, యూట్యూబ్ వంటి సామాజిక మాద్యమాలే అన్న సంగతి ప్రతీ ఒక్కరూ అంగీకరించే వాస్తవం. అసత్య ప్రచారం, ప్రసారం చేస్తున్న ఛానళ్ల పై గూగుల్ కు ఫిర్యాదు చేసినట్టు, క్రిమినల్ కేసులు పెడుతున్నట్టు కేటీఆర్ చెప్పడం పత్రిక, మీడియా రంగాన్ని హెచ్చరించే చర్యలా ఉంది తప్ప పరిపక్వం ఉన్న నాయకుడి మాటల మాదిరిగా లేదని పత్రికా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. తమకు, తమ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు వస్తే ఆనవాయితీ ప్రకారం ఖండనలు, వివరణలు పంపాల్సింది పోయి నేరుగా  కేసులు పెడతామని ప్రకటనలు చేయడం ఏమిటనే వాదన తలెత్తుతోంది.

డబ్బుకు ఆశ పడింది ఎవరు?

అధికారంలో ఉన్నప్పుడు ఒక్క విలేకరికి కూడా తిరుగి ప్రశ్నించే అవకాశం ఇవ్వని భారాస నేత నేడు వాస్తవాలను బయట పెడుతున్న సామాజిక మాధ్యమాల పై బెదిరింపులకు పాల్పడడం సమంజసం కాదని సూచిస్తున్నారు. నిజంగా రెండు దశాబ్దాల కిందటి మాదిరిగా తెలుగు మీడియా యాజమాన్యాలు ఉంటే పదేళ్లలో భారాస చేసిన ఆగడాలు ఈ పాటికి కొండెక్కి కూసేవనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కోడై కుస్తున్న భారాస అక్రమాలు గూగుల్ వంటి పేరున్న సంస్ధకు తెలియదనుకోవడం కెటిఆర్ అజ్ఞానానికి నిదర్శనమనే వ్యాఖ్యలు తెరపైకి వస్తున్నాయి. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నట్టు మేకపోతు గాభీర్యానికి దిగితే దాన్ని ఎలా అడ్డుకోవాలో తమకూ తెలుసునని జర్నలిస్టు సంఘాలు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాయి. అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశ పడి తప్పుడు వార్తలు అందిస్తున్నాయంటూ కేటీఆర్ “ఎక్స్” వేదికగా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. “డబ్బులకు ఆశ పడి” అనడం మీడియాను, దాని ప్రతినిధులను కేటీఆర్ అవమానించడమే అని మండి పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *