దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి సీటును జై స్వరాజ్ పార్టీ ఒక ఆటోడ్రైవర్ కి కేటాయించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వాహన చట్టంలోని కఠిన తరమైన నిబంధనలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని డ్రైవర్లు పార్టీ దృష్టికి తెచ్చారని, వాటికి వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా సామాన్య డ్రైవర్లకు తాము అండగా ఉండాలనే ఆలోచనతో నగరంలోని ఒక ఆటో డ్రైవర్ కు సీటు కేటాయించామని జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావుగౌడ్ తెలిపారు.

హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో నలుభై సంవత్సరాలకు పైగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న బత్తుల వెంకటేష్ గౌడ్ కు హైదరాబాద్ మెట్టు గూడ లోని జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీటు కేటాయించాలని పార్టీ నిర్ణయించి వెంటనే బీ ఫాం అందజేసిందని కాసాని చెప్పారు. బత్తుల వెంకటేష్ గౌడ్ నగరంలోని దిల్ సుఖ్ నగర్ ఉన్న పీ అండ్ టీ కాలనీలో ఏభై సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. తాను ఆటో నడుపుతూనే తన పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తన వృత్తిని కొనసాగిస్తూనే వివిధ రకాల సమాజ సేవల్లో పాల్గొంటున్నారు. సమాజ అభివృద్ధి పట్ల ఆయనకున్న ఆసక్తిని చూసి పార్లమెంటు బరిలో నిలుపుతున్నామని కాసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనకు దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావుగౌడ్, పార్టీ ఇతర నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన వాహన చట్టానికి వ్యతిరేకంగా తాము అనేక ఆందోళనలు నిర్వహించామని, తమ డ్రైవర్లకు చెందిన యూనియన్లు అన్నీ తమ నుంచి ఒకరు పోటీ చేయాలని అనుకున్నామని ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటేష్ గౌడ్ అన్నారు. డ్రైవర్ల సమస్యల పరిష్కారంతో పాటు పేదలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా తాను జై స్వరాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దుంబాల పరశ రాములు గౌడ్, ఆర్ ఎస్ జే థామస్, క్రాంతి, యామిని తదితరులు పాల్గొన్నారు.