గుర్తు లేదా"గురివిందా"..! - EAGLE NEWS

గుర్తు లేదా”గురివిందా”..!

guruvinda cf

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి వింత పోకడలు విస్తు కలిగిస్తున్నాయి. తెలంగాణ వచ్చి దశాబ్దం గడచిన ఉద్యమ ఆలోచనల నుంచి బయటపడని కొందరు నేతల అనాలోచిత నిర్ణయాలు భారాస అధిష్టానానికి ఒక రకంగా తలనొప్పి తీసుకు వస్తున్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే రాద్ధాంతం చేస్తున్న భారత రాష్ట్ర సమితి తీరు చూస్తుంటే గురివింద చందం గుర్తుకు వస్తోంది. ఉద్యమ పార్టీ పేరుతో 2014లో అధికారంలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అటు కాంగ్రెస్ నుంచి, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను ఎలా లోబరచుకుందో తెలంగాణ సమాజానికి తెలియని వాస్తవం కాదు. అప్పట్లో ఆయా పార్టీల నుంచి ఎన్నికైన వారి వ్యాపారాలను టార్గెట్ చేసుకొని బెదిరించిన సంగతి బహిరంగ రహస్యమే. ఈ సంగతి భారాస అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కి, అల్లుడు హరీష్ రావుకు తెలియని రహస్యం కాదు. కొందరికి మంత్రి పదవుల ఎర, మరి కొందరికి కాంట్రాక్టర్ల ఆశ ఇలా అనేక రకాలుగా భారాస భాషలో చెప్పాలంటే “మెడలు వంచి మరీ” టిడిపి, కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేలను వశ పరచుకున్న భారాస నీతి అందరికీ తెలిసిందే. ఉదాహరణ తలసాని, తుమ్మల, సాయన్న, మాగుంట గోపీనాథ్, తీగల కృష్ణా రెడ్డి, కడియం, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు బయటికి వస్తాయి. అలాంటి గత రాజకీయ చరిత్ర కలిగిన భారాస నేతలు ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వంటి నేత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే ఉద్యమ మూలాలు ఇంకా వదలని బాల్కా సుమన్ వంటి నేతలు రచ్చ చేసే ప్రయత్నం చేయడం నిజంగా శోచనీయం. ఓటమిని సహించుకోలేక, నియోజక వర్గ ప్రజలకు దగ్గర కాలేక సొంత పార్టీ నేతల పైనే కన్నేయడం ఒక రకంగా రాజకీయ నేరమే.

revanth pochrm

హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వెళుతున్న విషయం పోలీసులకంటే ముందే సుమన్ ముఠాకు తెలిసినట్టు ఉంది. అందుకే సెక్యూరిటీని సైతం తెంచుకొని నిరసనకు ఒడిగట్టారు. ఒక నేత ఏ పార్టీలోకి మారాలి అనేది అతని నైతిక అంశం. దాన్ని అడ్డుకోవడం తప్పు అనే విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్న అందరికీ తెలిసిందే. అలాంటిది పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అది తప్పు అన్నట్టు భారాస శ్రేణులు ఊగిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అది ఒకరకంగా పెద్ద తప్పిదం.

బాజిరెడ్డి గోవర్దన్, వేముల ప్రశాంత్ వంటి భారాస నేతలు సైతం పోచారం నిర్ణయం తప్పు అని రొడ్డుకెక్కడం కూడా రాజకీయ పరిశీలకులకు నచ్చడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భారాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు గోడ దూకుతారనే విషయం ఆ పార్టీ అగ్రనేతలు అంతర్గతంగా ఊహించిందే. లోక్ సభ ఎన్నికల సమయంలో ఆ ఫలితం కనిపించింది. ఎన్నికల తర్వాత భారాస సతికల పడడంతో వలసల పర్వం మొదలైంది. అటు ఫామ్ హౌస్ దాటిరాని అధినేత,సరైన రాజకీయ వ్యూహం లేని కేటీఆర్, హరీష్ వంటి ఆలోచనలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా లేవని కొందరు భారాసకు చెందిన సీనియర్ నేతలే వెల్లడించడం గమనార్హం. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయంలో కేసీఆర్ తెలంగాణా సాకుతో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికి ఏకంగా కేంద్ర మంత్రిగా వెలుగొందిన గతాన్ని భారాస నేటి తరం నేతలు గ్రహించకపోవడం విచారకరమని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *