బాపట్ల జిల్లా యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ అనే యువకుడు అమెరికాలో కాల్పుల ఘటనలో మృతి చెందడం తెలిసిందే. గోపీకృష్ణ అమెరికాలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుండగా, తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపి, తనకు కావాల్సిన వస్తువులు ఎత్తుకెళ్లాడు. ఈ కాల్పుల్లో గాయపడిన గోపీకృష్ణ చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశాడు.
యువకుడు మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ అనే ఓ కుర్రాడు టెక్సాస్ లో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి మృత్యువాతపడిన విషయం తీవ్రంగా కలచివేసింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను. గోపీకృష్ణ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అతడి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయపడతుందని హామీ ఇస్తున్నాను. ఈ కష్ట సమయంలో గోపీకృష్ణ కుటుంబానికి మేం అండగా నిలుస్తాం. వారు త్వరగా ఈ విషాదం నుంచి బయటపడాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
