దేశంలో ఐఏఎస్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి సవ్వాలక్ష ఆలోచనలు చేస్తారు. సమాజానికి, పౌరులకు మేలు జరిగే వ్యూహ రచనలను వారి మేధా సంపత్తే ప్రధాన కారణం. రాజకీయ నేతల పాలనను గాడిలో పెట్టేది కూడా ఈ పరిపాలన దక్షులే.అలాంటిది వీళ్ళ ఆలోచనలే అర్థరహితంగా ఉంటే ఖచ్చితంగా అవి ఏదో ఒక వర్గం పై వేటు పడుతుంది. అందుకే బాధ్యత గల ఏ అధికారి అయినా తన ఆలోచనలను బాహ్య ప్రపంచానికి చాటే ముందు వాటి పరిణామాలను ఒకటికి పది సార్లు పరీక్షించుకోవాలి. కొందరు తమ ప్రచారం కోసం, పేరు కోసం సామాజిక మాధ్యమాలలో షాట్స్, రీల్స్ చేసి పోస్టు చేసినట్టు స్మితా సబర్వాల్ వంటి చురుకైన, బాధ్యత గల అధికారి వాక్ స్వాతంత్రం పేరుతో కొత్త అంశాలను తెరపైకి తీసుకురావడం కొందరిని ఆగ్రహానికి గురి చేస్తోంది. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషించి, అనేక మంది అధికారులు, రాజకీయ నేతలతో పనిచేసిన అనుభవం ఉన్న ఆమె దివ్యంగుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు చేయడం పట్ల పలువురు సామాజిక విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా సంస్థలోని అనేక సమస్యలను పక్కన పెట్టిన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏమిటనే వాదనలు తలెత్తుతున్నాయి.
సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులకు కోటా ఎందుకుండాలి అంటూ స్మితా సబర్వాల్ “ఎక్స్” వేదికగా విసిరిన అంశం దుమారం రేపుతోంది. దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది. కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలవా, పౌర సేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవని, అందుకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని, వీటిలో రిజర్వేషన్ ఎందుకని స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా మంట రాజుకుంది. దివ్యంగ సంఘాల స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను నిరసిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో దివ్యాంగులు కూడా విమానాలు నడుపుతున్నారని గుర్తు చేశారు.
అందగత్తెలే కాదు : బాలలత
సివిల్స్ దివ్యాంగుల కోటాపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ లోని ఓ ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత మండిపడ్డారు. సివిల్స్ సాధించాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ‘దివ్యాంగుల గురించి మాట్లాడటానికి స్మిత ఎవరనీ, ఇద్దరం పరీక్ష రాద్దాం, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామా అని సవాలు విసిరారు. 24 గంటల్లో వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందో ళనకు దిగుతారనీ, రాష్ట్ర ప్రభుత్వం స్మితా సబర్వాల్ కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని బాలలత డిమాండ్ చేశారు.