రాష్ట్ర శాసనసభ సమావేశాలు అంటే ప్రజలకు అనేక ఆశలు ఉంటాయి. అందులో బడ్జెట్ సమావేశాలంటే మహా ప్రత్యేకం. ఈ బడ్జెట్ లో తమకు ఆమోదయోగ్యం కాని కేటాయింపులు, పథకాల పై ప్రశ్నించే గొంతుక కోసం వేచి చూస్తారు. అదే అధికార, ప్రతిపక్షాల మేళవింపు శాసనసభ. బలమైన అధికార పక్షం సభ ముందు ఉంచే అంశాలను అధ్యయనం చేసి తప్పు, ఒప్పులను ఎత్తిచూపాల్సిన నైతిక బాధ్యత ప్రతిపక్షానిది. కానీ తెలంగాణలో జరుగుతున్న తంతు విచిత్రంగా ఉంది. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి నేడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్షం. దాని అధినేత కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన ఆయన ఇప్పుడు జరుగుతున్న సభా సమావేశాలకు దూరంగా ఉండడం విస్మయం కలిగిస్తోంది.గత శాసన సభ ఎన్నికల్లో ఆరోగ్యం సహకరించక దూరంగా ఉన్న ఉద్యమ నేత కేసీఆర్ ఇప్పుడు ప్రారంభమైన సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనేది సగటు వ్యక్తిని తొలుస్తున్న ప్రశ్న.
తనపై, గతంలో తన పరిపాలన పై వసున్న ఆరోపణలు, విమర్శలకు తెలంగాణ సభా వేదికగా వివరణ ఇవ్వాల్సిన కేసీఆర్ ఆ నైతిక బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారనేది అంతుపట్టని సందేహం. “దొరతనం”తోనే అధికారాన్ని చేజార్చుకున్నారని వస్తున్న బలమైన ఆరోపణలు ఆయన తొలిరోజు సమావేశాలకు హాజరు కాకపోవడంతో నిజమయ్యాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రణాళికతో కేసీఆర్ సభలోకి అడుగు పెడతారని భారాస నేతలు చేస్తున్న ప్రకటనల పై ప్రజలకు ఇప్పటికే నమ్మకం సన్నగిల్లింది. ఆయన అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష నాయకుడి హోదాలోనే అడుగు పెట్టాలి. మొదటి రోజు సమావేశాలకే ఆయన హాజరవుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ, తొలిరోజు ఆయన జాడ లేదు. పదేళ్ల ఆయన పాలనలో కళ్ళకు కనిపిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, పోలీసు నిఘా విభాగం భాగోతం, ఫార్ములా రేసు నిధుల దుర్వినియోగం ఇలా మెడకు చుట్టుకున్న వివాదాలకు కేసీఆర్ సభా ముఖంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ కూడా అందుకు తగిన అస్త్రాలను అమ్ముల పొదిలో పెట్టుకుంది. వాటిని ఎదుర్కోవడానికైన కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన అవసరం ఉందని సాక్షాతూ భారాస వర్గాలే వెల్లడిస్తున్నాయి. అయితే, బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజున ఆయన సభకు వస్తారని తెలుస్తోంది. కానీ, అది ఊహా గానమే తప్ప భారాస అధికార ప్రకటన కాదు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా కాకపోయినా ఒక నియోజక వర్గం నుంచి ప్రజలు ఎన్నుకున్న నేతగా శాసనసభకు వెళ్ళాల్సిన నైతిక బాధ్యత కేసీఆర్ పై ఉందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.