పర్యటన ఆశాజనకం..

IMG 20240812 WA0000

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో రూ.31532 కోట్ల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించటం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

IMG 20240812 WA0005

రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రభుత్వ అధికారుల బృందం ఈ నెల 3వ తేదీన అమెరికా పర్యటనకు బయల్దేరింది. ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్, మూడు రౌండ్ మీటింగ్ లో పాల్గొంది. ప్రధానంగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి. ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్‌, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. వీటితో పాటు హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పకోదగ్గ మైలు రాయిగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ఈ పర్యటనలో యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది. శనివారం అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని రేవంత్ దక్షిణ కొరియాకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బృందం అమెరికా పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని అన్నారు. తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావటం శుభసూచకమని అన్నారు. అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని చాటిచెప్పేందుకు ఈ పర్యటన సత్ఫలితాలను అందించిందని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *