దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు వేదిక అవసరం. అందుకే ఢిల్లీలో పార్లమెంట్, రాష్ట్రాల్లో శాసన సభలు పని చేస్తోంది. రాజ్యాంగంలోని నియమ, నిబంధనలకు లోబడి పని చేస్తున్న ఈ చట్ట సభలను గౌరవించడం ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత. ప్రజల సంక్షేమం కోసం కొలువుదీరినవే ఈ సభలు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో గంపెడు ఆశలతో, కొండంత నమ్మకంతో నేతలను తమ ప్రతినిధిలుగా ఎన్నుకొని చట్టసభలకు పంపుతారు. ప్రజా సమస్యలను, వారి సంక్షేమానికి అవసరమైన పనులు, పధకాలపై అధికార, విపక్షాలు సభా వేదికగా చర్చించాలి. అక్కడే చర్చించి తీరాలి. రాజకీయ సభలు వేరు రాజ్యాంగ సభలు వేరనేది గ్రహించాలి. అలాంటి వారే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా నాయకుడు అవుతారు. శాసన సభలో ప్రజల పక్షాన గొంతెత్తితేనే చెల్లుబాటు అవుతుంది, పోరాటానికి విలువ పెరుగుతుంది. ఆ గళానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేగానీ, రోడ్లపైనో, ఇంట్లోనో, కార్యాలయంలోనో కూర్చుని మాట్లాడితే చెల్లని చిల్లుగవ్వతో సమానం. ఆంధ్రప్రదేశ్ కి ఐదేళ్ళ పాటు తిరుగులేని ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ మోహన్ రెడ్డి కి ఇంత చిన్న విషయం తెలియదా అనే వాదనలు మొదలయ్యాయి.

ఏమైంది జగనన్నా…
“సమస్యలను వాళ్ళ ముందే మాట్లాడాలా, మీడియా ముందు చెప్పినా సరిపోతుంది…అదే పద్ధతిలో వాళ్లను చెప్పమనండి” అంటూ అధికార తెలుగుదేశం మంత్రులను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించడాన్ని అనేక వర్గాలు తప్పు పడుతున్నాయి. చట్ట సభల్లో చర్చించాల్సిన అంశాలను ఎంత మాత్రం సంబంధం లేని మీడియా ముందు వెల్లడించడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కూడా ఇలాంటి ఆలోచన రాదని, ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ ఆలోచించకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని పలువురు సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. అసెంబ్లీలో మైకుల విలువ రాజ్యాంగ బద్దంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. 2014 శాసన సభ గడువు ముగిసేంత వరకు ప్రతిపక్ష నేతగా సమావేశాలకు హాజరుకాని జగన్ ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీకి అధినేతగా వ్యవహరిస్తున్నప్పుడు అధికార వ్యామోహమే కాదు, ప్రతిపక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించాలని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగానే సమస్యల సాధనకు పోరాడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. జగన్ మాట్లాడిన తీరు శాసన సభ్యులు అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లాలి… మీడియా ముందు చర్చిస్తే సరిపోతుందన్నట్లు ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.