చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఖచ్చితంగా సమావేశమై, అన్ని విషయాలు మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మోదీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. చైనాతో స్నేహ పూర్వక సంబంధాలను కోరుకుంటున్నాననే తప్ప గొడవలు కాదని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో అన్ని ప్రధాన దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ప్రతీకారం కోసం ఒకరిపై ఒకరు డబ్బు వృథాగా ఖర్చు చేసుకునే కంటే, ఆ డబ్బును మంచి పనులు, ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించాలని ట్రంప్ సూచించారు.
చైనాతో వాణిజ్యం, సుంకాల యుద్ధం గురించి అడిగిన ప్రశ్నలకు ట్రంప్ తనదైన రీతిలో బదులు ఇచ్చారు.చైనాను ఎదుర్కోవడంలో భారత్-అమెరికా సంబంధాలను మీరు ఎలా చూస్తారని అడిగిన ప్రశ్నకు చైనాతో మా సంబంధాలు చాలా బాగుంటాయని నేను భావిస్తున్నారు. కోవిడ్-19కి ముందు, నాకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో చాలా మంచి సంబంధాలు ఉండేవని, ప్రపంచంలో చైనా చాలా ముఖ్యమైన దేశమని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో జిన్‌పింగ్ మాకు సహాయం చేయగలరని నేను భావిస్తున్నాను. చైనా, భారత దేశం, రష్యా, అమెరికా కలిసి పని చేయగలవనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది చాలా ముఖ్యం కూడా అన్నారు.
ప్రతీకారం కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం ఎందుకని ట్రంప్ ప్రశ్నించారు. నా మొదటి పదవీ కాలంలో అణ్వాయుధ నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా మాట్లాడగా వారూ సానుకూలంగా స్పందించారని ట్రంప్ వివరించారు. అమెరికా దేశ రక్షణ కోసం 900 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నామని, చైనా కూడా 450 బిలియన్ డాలర్ల వరకు వెచ్చిస్తోందన్నారు. ఈ డబ్బును మంచి ప్రయత్నాల కోసం ఎందుకు వినియోగించ కూడదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి జరుగుతుందని వెల్లడించారు. గతంలో తను అధికారంలో ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం లేదనీ, రష్యా – ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం లేదన్నారు. ఇప్పుడు తిరిగి అధికారం లోకి వచ్చే సరికి ప్రపంచం మొత్తం రగిలి పోతోందనీ, ముందు ఈ మంటను చల్లార్చాల్సిన బాధ్యత తనపై ఉందని ట్రంప్ చెప్పారు. ఆ తరువాత రష్యా, చైనా లతో కూర్చుని మాట్లాడి పరస్పర సంఘర్షణను ముగించడానికి ప్రయత్నించనున్నట్టు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.