తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా యడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం సతమతం అవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు పొంగిపొర్లడంతో రహదారులు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదపు 36 గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు గోదావరి తీరప్రాంత వాసులను భయందోలనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టులు నుండి వస్తున్న వరద నీటి వల్ల రాజమండ్రి, భద్రాచలం వద్ద నీటి మట్టాలు పెతుగుతున్నాయి. ఇప్పటకే భద్రాచలం వద్ద దాదాపు 40 అడుగులకు చేరుకున్న వరద ప్రవాహం మరింత పెరిగి 43 అడుగుల మొదటి హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోదావరి దిగువ ప్రాంత్రలకు 7 లక్షల 66 వేల 842 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగ సూచనలు, సలహాలు పాటించాలని ప్రజలకు సూచించారు. ముంపునకు కాకుండా ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కాళేశ్వరంతో పాటు తాలిపేరు ప్రాజెక్టు గేటు ఎత్తడంతో భారీగా వరద ప్రవాహం వస్తోంది.
అటు పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం క్రమంగా పెఫుగుతోంది. అధికారులు ముందు జాగ్రత్తగా ఆనకట్ట 175 గేట్లను ఎత్తివేసి 1.90 లక్షల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద వరద పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు చేరేందుకు సుమారు 18 గంటలు పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో వరద పెరిగి బ్యారేజీ వద్దకు 5 లక్షల క్యూసెక్కుల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై రెండు ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు రెండు రోజుల సెలవు ప్రకటించింది.