కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు తెలంగాణాలోని పలు జిల్లాలను ముద్ద చేశాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉత్తర ఆంధ్రకు ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, దాని పొరుగు ప్రాంతాల మీద ఉన్న బలమైన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు బలహీనపడి దక్షిణ ఒడిశా, దీన్ని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీద విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధం గా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. అత్యధిక వర్షపాతం నమోదు వలన ముఖ్యంగా ఉమ్మడిదిగ్భందం ఆదిలాబాద్ , వరంగల్ , ఖమ్మం జిల్లాలలో నీటి ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం పెరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 19 సమస్యాత్మక ప్రాంతాలలో చీఫ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ ఆపరేషన్ బృందాలు పని చేస్తున్నాయని ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నాయని ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రజలకు అండగా నిలవాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మేడారంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క-సారలమ్మ ఆలయం సహా అనేక చోట్ల రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది. మహబూబ్ నగర్ , రాయచూరు మార్గం లోని దేవసూర్ దగ్గర బ్రిడ్జి కూలిపోయింది.
భద్రాచలం వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని, భద్రాచలం పట్టణంలో వరద నీటి ప్రవాహం కట్టడి చేయడానికి భారీ మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణానష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రెండు హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచామని. పోలవరం గేట్లు ఎత్తి ఉంచాలని సంబంధిత ప్రాజెక్టు అధికారులతో నిరంతరం మన రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు.