తెలంగాణలో వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను జల దిగ్బంధం చేసిందని, భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని, ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్ళిన 40 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయిన విషయం ఆందోళన కలిగిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సత్వరమే బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేయాలని పవన్ కోరారు. మరో పక్క నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ గరిష్ట స్థాయి దాటి నీరు ఉప్పొంగడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తుశారు. జనసేన నాయకులు, శ్రేణులు బాధిత ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.