“పెద్దసారు”కోసం…

pres acadmy

తెలంగాణ మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు. 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో నాంపల్లి లోని పాత ప్రెస్ అకాడమీ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. ఆ మేరకు  2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారు. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక అంతస్తు నిర్మించారు. రెండంతస్తుల్లో కలిపి 250 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్, తదితరులకు ప్రత్యేక గదులు ఉన్నాయి. తరగతి గదుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్ల కోసం ప్రత్యేక గదిని కూడా నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ  ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరిగింది. నిర్మాణం పూర్తయిన సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి, డైరెక్టర్ రాజమౌళి తదితర అధికారులు అకాడమీ భవనాన్ని ఇటీవల పరిశీలించారు. భవనం పనులన్నీ తుది దశకు వచ్చినందున, మిగిలిన పనులు పూర్తి చేసి తుది మెరుగులు దిద్దవలసిందిగా ఆర్ అండ్ బి అధికారులను కోరారు. కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్ల, జర్నలిస్టుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్, అశోక్ రెడ్డి ఇంజనీర్లకు కొన్ని సూచనలు చేశారు. త్వరలో మీడియా అకాడమీ భవనం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని అకాడమీ చైర్మన్ తెలిపారు. ఇప్పటికే ఈ మేరకు ముఖ్యమంత్రికి  విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన ఆమోదం కోసం చూస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి ఈ భవన ప్రారంభానికి వస్తే ఆయన ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇచ్చిన హామీల అమలుకు మోక్షం కలిగే ప్రకటన రావచ్చని విలేకరులు ఆశాభావం వ్యక్త పరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *