వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం వైయస్ జగన్ ప్రకటించిన నాటి నుంచి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ అదే పనిగా విషం చిమ్ముతున్నారని మంత్రి ఆర్‌కె రోజా అన్నారు. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం కృషి చేస్తుంటే, ఆ నగరాన్ని క్రైమ్ సిటీగా, అక్కడి ప్రజలను అవమానించే విధంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు మాట్లాడినట్టు , విమర్శించినట్టు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళ్తూ పవర్‌స్టార్‌గా కాకుండా, రీమేక్ స్టార్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, రఘురామకృష్ణంరాజు ముగ్గురూ రుషికొండపై కట్టడాలను వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లారు. కానీ ఏ కోర్టు కూడా అవి అక్రమ కట్టడమని చెప్పలేదు. పనులు ఆపేయాలని అనలేదు. చివరకు వారు ఎన్జీటీని కూడా ఆశ్రయించారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా రుషికొండపై కట్టడాలపై అభ్యంతరాలు చెప్పలేదు. చట్ట పరంగా జరుగుతున్నా పనులను అపమనడానికి మీరెవరని ప్రశ్నించారు. దీనికి సూటిగా సమాధానం చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. ఒకవేళ కొండమీద కట్టడాలు తప్పైతే రుషికొండ పక్కనే కొండల మీద రామానాయుడు స్టుడియో ఉంది. రుషికొండ ఎదురుగా ఐటీ టవర్స్ కొండల మీదనే ఉన్నాయి. వుడా టవర్స్, టీటీడీ ఆలయం కూడా కొండపైనే ఉన్నాయి. అవేవీ నీకు కనిపించడం అన్నారు. జూబిలీహిల్స్‌లో నీ ఇల్లు, మీ అన్నయ్య ఇల్లు రెండూ కొండలపైనే ఉన్నాయని, చివరకు రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కొండలు తొలిచే కట్టిన మాట వాస్తవం కదా అన్నారు. రుషికొండపై కట్టడాలు వ్యతిరేకిస్తున్న పవన్‌కళ్యాణ్ పవర్‌స్టార్ కాదని ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ అనేది అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. అదే రుషికొండ ఎదురుగా బాలకృష్ణ రెండో అల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు గీతం యూనివర్సిటీ కోసం 40 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే దాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. దీనిపై ఎందుకు మాట్లాడవని పవన్ కళ్యాణ్ ని రోజా ప్రశ్నించారు. రుషికొండపై ఇప్పటికే హరిత రిసార్ట్ ఉంది. అది పాడై, పాత బడి పోయింది కాబట్టి కొత్తగా నిర్మాణం జరుగుతోందని, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా రాబోతున్నది కాబట్టి, కొత్త వాటి నిర్మాణం చేపట్టినట్టు రోజా వివరించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా జనసేన పార్టీని నిర్మాణాత్మకంగా నడపడానికి ప్రయత్నించాలి గానీ చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని ఆయన చెప్పినట్లు పని చేయొద్దని రోజా విమర్శించారు.