జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ? చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమండ్రి జైలులో ఆయన్ని కలిసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన పవన్ ఎక్కడ ఉన్నారు? పార్టీ శ్రేణులతో బిజీగా ఉన్నారా? లేక సినిమా షూటింగుల్లో మునిగి పోయారా ? ఏ విషయం తెలియక “సేన” సైన్యం సందిగ్ధంలో ఉంది. వచ్చే నెలలో అయన వారాహి యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో తెలుగదేశం పార్టీ పొత్తుకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. టిడిపితో పొత్తు ఖరారైనట్టు ప్రకటించిన తర్వాత చంద్రబాబు అరెస్టు పై పవన్ గానీ, ఆ పార్టీ నేతలు గానీ నోరు మెడపక పోవడం ఆంధ్రా రాజకీయాల్లో అనుమానాలకు దారితీస్తోంది. చంద్రబాబు అరెస్టు అక్రమం అని దేశ, విదేశాల్లో నిరసన పెల్లుబుకుతుంటే తెలుగుదేశంతో అంటకాగుతున్నట్టు బహిరంగంగా ప్రకటించిన జనసేన వారం, పది రోజులుగా ఎందుకు నోరు మెదపడం లేదనేది రాజకీయ వర్గాలకు సైతం అంతు పట్టడం లేదు. ఢిల్లీలో లోకేష్ ప్రయత్నాలకు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు జనసేన ఎందుకు స్పందించడం లేదని వాదనలు తలెత్తుతున్నాయి. రింగు రోడ్డు వ్యవహారంలో లబ్ది పొందినట్టు పవన్ పై కూడా ఆరోపణలు రావడం వల్లే అయన బాబు వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నారా అనే అనుమానాలు బలంగా అనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ తో అంటకగినట్టు సూచనలిచ్చిన పవన్ ఆంధ్రలో ఒక్కసారిగా తెలుగుదేశంతో పొత్తుకు దిగడం రాజకీయంగా పలు రకాల చర్చలకు తెర లేపుతోంది. ఇవ్వన్నిటికీ వచ్చే నెలలో ప్రారంభం కానున్న వారాహి యాత్రలో సమాధానం దొరుకుతుందేమో వేచి చూడాలి.