కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో భారీ పేలుడు సంభవించి ఒకరు మరణించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్నాకులంలోని కాళామస్సేరీలో ఉన్న జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రెండు వేల మందికిపైగా పాల్గొన్న ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇందుకు ఐఈడీ ఉపయోగించారని వెల్లడించారు.పేలుడుకు సంబంధించి ఆదివారం ఉదయం 9.40 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు. కన్వెన్షన్ సెంటర్ నుంచి హుటాహుటిన ప్రజలను బయటకు పంపించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనలో ఓ మహిళ చనిపోయిందని తెలిపారు. కన్వెన్షన్ సెంటర్లో భారీ పేలుడు కన్వెన్షన్ హాల్లో మూడు నుంచి నాలుగు చోట్ల పేలుళ్ల జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చుట్టు పక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రార్థనా సమయంలో వీరంతా కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగినట్లు చెప్పారు. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగాయని వెల్లడించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటం వల్ల క్షతగాత్రులను తరలించడంలో కొంత జాప్యం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు సమచాారం.ఘటనలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ తెలిపారు. వారికి కాళామస్సేరీ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే వేరే ఆస్పత్రికి తరలిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి అధికారులును ఆదేశించారు.
ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరపాలని అధికారులు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. మరోవైపు, పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. సీఎం విజయన్ కి ఫోన్ చేసి మాట్లాడారు. పేలుడు కోసం ఐఈడీ వాడినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.