“దేశం”పయనం ఎటు…!

tdp logo 1

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్,  కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది. పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు తర్వాత అన్నీ తానై ఒంటిచేతితో పార్టీని ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు అనూహ్యంగా జైలుకి వెళ్ళడం ఎన్నికల సమయంలో గట్టి దెబ్బ తగిలినట్టయింది. రెండు తెలుగు రాష్టాల్లోను టిడిపి చుక్కాని లేని నావలా మారడం ఈ పార్టీ శ్రేణులు, కొందరు నాయకుల్లోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ పైనే ఎక్కువగా దృష్టి సారించడంతో తెలంగాణా లోని ఆ పార్టీ సీనియర్ నేతలు బి.అర్.ఎస్., కాంగ్రెస్ పార్టీలలో చేరారు.అయితే, చంద్రబాబుకి మాత్రం తెలంగాణాలో తమకు ఎక్కడెక్కడ బలముందనే విషయంలో స్పష్టత ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను రంగలోకి దించాలనే ఆలోచనతో ఏడాది కిందటే టిడిపి తెలంగాణా పార్టీ లో నాయకత్వ మార్పునకు తెరలేపారు. అందులో భాగంగానే కాసాని జ్ఞానేశ్వర్ కి పగ్గాలు అప్పజెప్పారు. దీంతో కొంత కాలంగా సభలు, సమావేశాలతో తెలంగాణాలో తిరిగి పార్టీ హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల్లో అభ్యర్ధులను రంగంలోకి ఉంచితే కనీసం కొన్ని సీట్లు గెలుపొందవచ్చనే గట్టి నమ్మకం చంద్రబాబులో ఉండి. అందుకే అనేక సార్లు పార్టీ తెలంగాణా నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అయితే, ఇక్కడ ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలోనే బాబు అరెస్టు కావడం, బెయిల్ పై స్పష్టత లేకపోవడం సమస్యగా మారింది. పార్టీని ముందుకు నడిపించాల్సిన లోకేష్, భువనేశ్వరి, అచ్చన్నాయుడు వంటి వారి దృష్టి మొత్తం చద్రబాబు నాయుడు బెయిల్ వ్యవహారం, ఆంధ్రా రాజకియలపైనే ఉండడంతో తెలంగాణలో పార్టీ  ఎన్నికల వ్యూహ రచనకు దిక్కులేకుండా పోయింది. రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు సమాచారం బయటకు రావడంతో రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి.

తెలంగాణాలో ఎంత బలం ఉందనే విషయంపై సరైన స్పష్టతలేని జనసేన పార్టీ 32 నియోజక వర్గాల్లో తన అభ్యర్ధులనుఎన్నికల బరిలోకి దించుతున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఈ విషయంపైనే తెలంగాణాలో చర్చ మొదలైంది.ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం పార్టీ తో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణాలో మాత్రం ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటించడం రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. తెలుగుదేశం నేతలతో మాట మాత్రమైనా చెప్పకుండా జనసేన అభ్యర్ధులను ప్రకటించడం తెలంగాణా టిడిపి నేతలకు మింగుడు పడడం లేదు. ఇదే విషయాన్ని కొందరు నేతలు జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా ప్రస్తుత పరిస్థితిలో ఏమి చేయలేమనే సమాధానం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కలిసి వచ్చినా, రాకున్నాగానీ తెలుగుదేశం తో కలిసి వెళ్తామని  ప్రకటించిన జనసేన, తెలంగాణా ఎన్నికల విషయంలో మాత్రం ద్వందవైఖరి అవలంభించడం  అంతుపట్టని వ్యవహారం. తెలంగాణలో తెలుగుదేశం నేతలను కాదని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి  బిజెపి నేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరపడం పట్ల కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలోకి దించి తిరిగి తెలంగాణాలో టిడిపి ప్రభావాన్ని ఆశించిన నేతలకు రాజమండ్రి జైలులో ఎదురు దెబ్బ తగిలినట్టయింది. తెలంగాణాలో ఆ పార్టీ పోటీ చేయడం పై రెండు,మూడు రోజుల కిందట గుప్పుమన్న వదంతులపై ములాఖత్ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబు చర్చించారు. కానీ, ఆ ఊహాగానాలు నిజమేనని తేలిపోయింది.  ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మధ్య తెలంగాణపై దృష్టిపెట్టలేమని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే, వచ్చే లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తేనే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపవచ్చనే అభిప్రాయ పడుతున్నాయి. నలుగు దశాబ్దాలుగా ప్రతీ ఎన్నికల్లో పోరాడుతున్న “దేశం” జండా ఈ ఎన్నికల్లో కనిపించడం లేదనే విషయాన్ని తెలంగాణా నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *