ఎఐసిసి ఆదేశాల మేరకు సిపిఐ,కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో, రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించి ఒక ఒప్పందానికి వచ్చినట్టు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో మోడీ కారణంగా, రాష్ట్రంలో కెసిఆర్ కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఎన్ డి ఎ కూటమిని ఇండియా కూటమి ఓడించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, సిపిఐల మధ్య స్పష్టంగా పొత్తు ఖరారైందని, కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐని గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని, కలిసి పని చేయాలని ఎఐసిసి ఆదేశించినట్లు చెప్పారు. ఎన్నికల తరువాత రెండు ఎం.ఎల్.సి. స్థానాలను సిపిఐకి ఇస్తామన్నారు. సెక్యూలర్ శక్తులకు విశ్వాసాన్ని కల్పించేలానే ఉద్దేశంతో పేద, సామన్యుల సమస్యలను చట్టసభలలో ప్రస్తావనకు వస్తాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగానే శాసనమండలిలో సిపిఐకి చెందిన ఇద్దరు సభ్యులను నియమిస్తామని వెల్లడించారు. తమపై రాజకీయ ఒత్తిడి, తాజా పరిణామాలు, పరిస్థితులను సిపిఐ నేతలకు వివరించామని తెలిపారు. పేదల తరపున నిలబడేందుకు, పెద్దమనుసుతో ముందుకురావాలని తాము చేసిన విజ్ఞప్తికి సిపిఐ ముందుకు వచ్చినందుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలంటే కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని వివరించామన్నారు. మునుగోడు శాసనసభ అంశంపై కూడా చర్చ జరిగిందని, సిపిఐ ప్రతిపాదించే వారికి చట్టసభలకు పంపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సమస్యలపై కలిసి పోరాటం, ఎన్నికల ప్రచారం, ఓటు బదిలీపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. సిపిఐ(ఎం)తో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్ టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి సోమవారం నాడు వచ్చారు. ఆయనతో పాటు ఎఐసిసి పరిశీలకులు దీపా దాస్ మున్షీ, ఎఐసిసి కార్యదర్శి విష్ణుదాస్ కూడా వచ్చారు. వీరు సిపిఐ నేతలతో భేటీ అయి పొత్తుల గురించి చర్చించారు. ఎఐసిసి ఆదేశాలతో వచ్చిన కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, పల్లా వెంకట్ రెడ్డి, బాగం హేమంతరావు, ఇ.టి.నర్సింహ, బాలనర్సింహా, వి.ఎస్.బోస్ ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తరుపున పొత్తులకు సంబంధించి చేసిన ప్రతిపాదనలను అంగీకరించారు.